Nellore: నెల్లూరు జిల్లాలో నకిలీ పట్టాలతో భూమి కబ్జా యత్నం!

Nellore: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చుంచులూరులో నకిలీ పట్టాలతో 2.50 ఎకరాలు కాజేసేందుకు యత్నిస్తున్నారని బాధితురాలు పుల్లమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 25 Sept 2026 2:40 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు జిల్లాలో నకిలీ పట్టాలతో భూమి కబ్జా యత్నం!

Nellore: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని చుంచులూరు గ్రామానికి చెందిన చింతలపల్లి పుల్లమ్మకు సంబంధించిన భూమిపై కొందరు నకిలీ పత్రాలు సృష్టించి తమదేనంటూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. చుంచులూరు రెవెన్యూ పరిధిలోని 185-1 సర్వే నంబరులో 2 ఎకరాల 50 సెంట్ల భూమి గత 20 ఏళ్లుగా తమ ఆధీనంలో ఉందని, రెవెన్యూ రికార్డులతో పాటు ఆన్‌లైన్‌లోనూ నమోదు అయి ఉందని తెలిపారు.

తమకు సంబంధించిన భూమిపై గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఇటీవల నకిలీ పట్టాలు, ఇతర పత్రాలు సృష్టించి భూమి తమదేనంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని పుల్లమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల తాము భయాందోళనకు గురవుతున్నామని పేర్కొన్నారు.తమ భూమికి సంబంధించి ఆన్‌లైన్‌ అడంగల్‌, 1-బి రికార్డులతో పాటు డి-పట్టా, పట్టాదారు పాస్‌పుస్తకాలు కూడా ఉన్నాయని ఆమె తెలిపారు.

ఇన్ని అధికారిక రికార్డులు తమ వద్ద ఉన్నప్పటికీ, భూమిపై వివాదం సృష్టించి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. సమస్య పరిష్కారం కోసం పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఇప్పటివరకు న్యాయం జరగలేదని పేర్కొన్నారు.185-1 సర్వే నంబరులోని భూమికి సంబంధించిన పాత, ప్రస్తుత రెవెన్యూ రికార్డులు, పట్టాలు, ఆన్‌లైన్‌ నమోదులు, ఇతర పత్రాలను సమగ్రంగా పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తేవాలని ఉన్నతాధికారులను పుల్లమ్మ కోరారు. నకిలీ పత్రాలు సృష్టించినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుని, తమ భూమికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)