Nellore: నెల్లూరు డీఆర్‌సీ సమావేశం.. సాగునీరు, రైతుల సమస్యలపై కీలక నిర్ణయాలు!

Nellore: నెల్లూరు నూతన జిల్లా పరిషత్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ అధ్యక్షతన జిల్లా సమీక్షా కమిటీ (DRC) సమావేశం ఘనంగా ముగిసింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 11 Jun 2026 7:12 AM IST
Nellore
X

Nellore: నెల్లూరు డీఆర్‌సీ సమావేశం.. సాగునీరు, రైతుల సమస్యలపై కీలక నిర్ణయాలు! 

నెల్లూరు: నెల్లూరు నూతన జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా ఇన్‌ఛార్జ్, రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ అధ్యక్షతన జరిగిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశం ముగిసింది. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆధ్వర్యంలో జరిగిన ఈ కీలక సమావేశంలో రాష్ట్ర మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డిలతో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బుధవారం ఉదయం ప్రజాప్రతినిధులతో భేటీ అనంతరం ప్రారంభమైన ఈ సమావేశంలో జిల్లాలోని వివిధ శాఖల అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు తీరు మరియు ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు, మంత్రులు సుదీర్ఘంగా సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

నెల్లూరు జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ మాట్లాడుతూ...స్థానిక ప్రజాప్రతినిధులు మరియు కలెక్టర్‌తో కలిసి పలు కీలక అంశాలపై ఫలప్రదమైన చర్చలు జరిపామని మంత్రి ఫరూక్ తెలిపారు. రాబోయేది ఖరీఫ్ సీజన్ కావడంతో ఎక్కువగా వ్యవసాయం, హార్టికల్చర్, పశుసంవర్ధక శాఖ మరియు మత్స్య శాఖలపైనే ప్రత్యేకంగా దృష్టి సారించామని..ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో పొగాకు పండిస్తున్నప్పటికీ వారికి పొగాకు బోర్డులో సభ్యత్వం మరియు తగిన గుర్తింపు లేకపోవడంపై ఒక తీర్మానాన్ని ఆమోదించామన్నారు. అలాగే జొన్న పంటకు ప్రభుత్వం 3,699 మద్దతు ధర ప్రకటిస్తే, మార్కెట్లో 2,700 నుండి 3,000 లోపే పలుకుతుండటంతో ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించామని, మరియు మొక్కజొన్న కొనుగోళ్లపై కూడా చర్చించామన్నారు.. వీటితో పాటు MSME రంగంలో ఉన్న, భూవివాదాల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారని, ప్రస్తుతం జలాశయాలలో 75 TMCల నీరు నిల్వ ఉండటం సంతృప్తికరంగా ఉందని చెప్తూ, హోం శాఖ, జాతీయ రహదారులు మరియు హౌసింగ్ వంటి ఇతర స్థానిక సమస్యలను కూడా ఈ సమావేశంలో సుదీర్ఘంగా సమీక్షించామని తెలియజేశారు.

రాష్ట్ర దేవాదాయశాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడారు.

వాతావరణ మార్పుల నేపథ్యంలో సోమశిల, కండలేరు ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని అత్యంత జాగ్రత్తగా వాడుకోవాలని, నీటిపారుదల శాఖలో ఏ మాత్రం వృథా కాకుండా ప్రతి చుక్కను రైతులకు అవసరమైన మేరకే విడుదల చేయాలని అధికారులను కోరినట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో దాదాపు 46 వేల ఎకరాల్లో పొగాకు సాగు చేస్తూ, 3,600 నుండి 4,000 మంది రైతులు, 3,800 బార్నీలతో ఇంత పెద్ద ఎత్తున సాగు జరుగుతున్నప్పటికీ, టొబాకో బోర్డులో నెల్లూరు జిల్లా రైతాంగానికి గానీ, పొగాకు పండించే ఆత్మకూరు, ఉదయగిరి, కావలి ప్రాంత ప్రజాప్రతినిధులకు గానీ కనీస ప్రాతినిధ్యం లేదనే విషయాన్ని ఇటీవల తానే స్వయంగా డీసీపల్లి టొబాకో బోర్డు వద్దకు వెళ్ళినప్పుడు గుర్తించానని, దీనిపై వ్యవసాయ శాఖ మంత్రితో మరియు పొగాకు రైతాంగం తరఫున ఉన్న సహచర మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో మాట్లాడగా, భవిష్యత్తు సమావేశాలకు మన జిల్లా ప్రతినిధులను తప్పకుండా ఆహ్వానిస్తామని హామీ ఇచ్చారని మీడియాకు వివరించారు. అలాగే, ఒంగోలు జాతి ఎద్దులను కాపాడుకోవడానికి గతంలో ప్రభుత్వం 2,500 ఎకరాల భూమిని కేటాయించి ఏర్పాటు చేసిన చింతలదేవి బ్రీడింగ్ సెంటర్‌కు, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన కామధేను ప్రాజెక్టుకు గతంలో నీటి వసతి కల్పించకుండా వదిలేశారని, అయితే ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక GKN కెనాల్ రాళ్లపాడు ప్రాజెక్ట్ సమీపంలోనే ఒక సోర్స్ ఏర్పాటు చేసి, మర్రిగుంట చెరువును సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌గా మార్చి పంపింగ్ ఏర్పాట్లు పూర్తి చేశామని, మిగిలిన 20% పనులను కూడా రాబోయే 2-3 మాసాల్లో పూర్తి చేసి నీటి వసతి కల్పిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలో భాగంగా జిల్లాలో మొట్టమొదటి MSME ప్రాజెక్టును ఆత్మకూరులో ప్రారంభించినప్పటికీ అక్కడ పరిశ్రమలకు నీటి కొరత ఉందని, సోమశిల నుండి పైప్‌లైన్ ద్వారా నీటిని తెచ్చేందుకు గానూ ప్రస్తుతం అర్బన్ ప్రాంతాలకు వచ్చే పైప్‌లైన్లను అప్‌గ్రేడ్ చేసి కొంత నీటిని MSMEకి ఇచ్చేలా పరిశీలించాలని పురపాలక శాఖ మంత్రి నారాయణ ను కోరగా.. వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఇదే సమయంలో ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో అమృత్ పథకం కింద మంచి నీటి సరఫరా కోసం దాదాపు 34 కోట్ల రూపాయలు మంజూరై, టెండర్ ప్రక్రియ కూడా విజయవంతంగా పూర్తయినట్లు మంత్రి నారాయణ తెలపడం పట్ల ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెబుతూ, ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్న సీనియర్ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుని జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియా ముఖంగా వెల్లడించారు.

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డా.పొంగురు నారాయణ మాట్లాడుతూ... ఈరోజు మన జిల్లా ఇంచార్జ్ మంత్రి వర్యులు గౌరవనీయులు ఫరూక్ ఆధ్వర్యంలో, నేను, నా తోటి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి , ఎంపీ బీదా మస్తాన్ రావు మరియు జిల్లా శాసనసభ్యులందరం పాల్గొన్న డీఆర్‌సీ సమావేశం చాలా సానుకూల వాతావరణంలో ముగిసిందని. శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాల సమస్యలను ఈ వేదికపై బల అభిప్రాయాలను వెలిబుచ్చారు, ముఖ్యంగా వ్యవసాయం, నీటి పారుదల రంగాలపైనే సుదీర్ఘంగా చర్చించామని మంత్రి నారాయణ తెలిపారు . త్వరలోనే వర్షాకాలం ప్రారంభం కాబోతున్నందున కండలేరు, సోమశిల జలాశయాల నీటి నిల్వలపై సమీక్షించి, సాగునీటి ప్రధాన కాలువల రిపేర్ల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించమన్నారు. అలాగే రైతులకు యూరియా పంపిణీకి సంబంధించి గతంలో యాప్ ద్వారా ఒక రైతుకు మొదట రెండు బస్తాల చొప్పున ఇస్తామని చెప్పినప్పటికీ, మీటింగ్‌లో సభ్యులందరూ మూడు బస్తాలు ఇవ్వాలని కోరగా, మేము ఈ మీటింగ్‌కు వచ్చేటప్పటికే ప్రభుత్వం ఆల్రెడీ దాన్ని 3 బస్తాలకు పెంచుతూ అంగీకరించిందనే శుభవార్తను ఇక్కడ తెలియజేశారు. ఇక మన జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో పొగాకు పండిస్తున్న రైతుల సమస్యలను నేరుగా పొగాకు బోర్డ్ దృష్టికి తీసుకెళ్లడానికి మన జిల్లా నుండి ఒక మెంబర్ ఉండాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసిన ప్రతిపాదనపై వెంటనే స్పందించి, కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి ఇమిడియట్‌గా లెటర్ రాయమని ఆదేశిస్తూ ఇక్కడే ఒక కీలక తీర్మానం పాస్ చేశామని, రాబోయే రోజుల్లో మేమిద్దరం ఫాలోఅప్ చేసి మన జిల్లా వ్యక్తికి ఆ పదవి దక్కేలా చూస్తాంమన్నారు. ఇదే సందర్భంలో చింతలదీవి బ్రీడింగ్ సెంటర్‌లో మెయిన్‌గా ఉన్న నీటి సమస్యకు ఒక సొల్యూషన్ చెప్పడంతో పాటు, మన ఎంపీ బీదా మస్తాన్ రావు తన ఎంపీ ఫండ్స్ నుంచి కాకుండా, ఆయన సొంత కంపెనీ తరపున 10 మిలియన్ల ప్రాన్ సీడ్ ఉచితంగా ఇస్తానని ప్రకటించడంపై ఆయనను ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు వీటిని మన కాలువల్లో వదిలితే వేటాడి రొయ్యలు పట్టుకునే పేద సామాజిక వర్గాలకు ఎంతో బెనిఫిట్ అవుతుందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి అడిగిన మున్సిపల్ పరిధిలోని అల్లిపురం రోడ్డు సమస్యపై ఇప్పుడే ఇమిడియట్‌గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, మరొక్క వారంలో దానికి సంబంధించిన టెండర్లు పిలవాలని ఆదేశించాం మని అలాగే జిల్లాలో కాలనీల ఏర్పాటుకు, స్కూళ్ల నిర్మాణానికి స్థలాలు ఇచ్చిన దాతలను గౌరవిస్తూ ఆయా ప్రాంతాలకు సదరు దాతల పేర్లనే పెట్టాలని రిజల్యూషన్ చేసి పంపాం అని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో 175 MSME పార్కులు పెట్టాలనేది మన ప్రభుత్వ లక్ష్యం కాగా, ఇందులో ఫస్ట్ పార్కును ఆల్రెడీ ఆత్మకూరులోనే ఇనాగ్యురేట్ చేశాం, ఇక నెల్లూరు సిటీలో కడుతున్న ఫ్లాటెడ్ MSME పార్క్ సివిల్ పనులన్నీ పూర్తిగా పూర్తయ్యాయి కాబట్టి కేవలం పెండింగ్ ఉన్న ఎలక్ట్రిసిటీ పనులను కూడా మరో 10 రోజుల్లో కంప్లీట్ చేసి పార్కును ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు ..మొత్తంగా ఈరోజు జరిగిన డీఆర్‌సీ మీటింగ్‌లో జిల్లా అభివృద్ధికి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నాం అని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ,వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ, పాశం సునీల్ మరియు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story