Nellore: నెల్లూరు జిల్లాలో కలకలం: పంటల మాటున గంజాయి సాగు!
Nellore: నెల్లూరు జిల్లా దుత్తలూరులో గంజాయి సాగు గుట్టురట్టయింది. మొక్కజొన్న, కంది మాటున 2 ఎకరాల్లో సాగు చేస్తున్న ప్రధాన నిందితుడితో పాటు పలువురి అరెస్ట్.
Nellore: నెల్లూరు జిల్లాలో కలకలం: పంటల మాటున గంజాయి సాగు!
Nellore: చుట్టూ పచ్చని అటవీ ప్రాంతం.. మధ్యలో పచ్చని పంటలు.. చుట్టూ ఎత్తైన వెదురు కంచె.. ఇదంతా చూస్తే ఆదర్శ రైతు సాగు చేసిన అద్భుతమైన తోట అనిపిస్తుంది. కానీ ఆ పచ్చదనం మాటున సాగవుతున్నది గంజాయి పంట! అదీ జాతీయ రహదారికి సమీపంలో.. మండల కేంద్రానికి కూతవేటు దూరంలో! కంది, మొక్కజొన్న పంటల మాటున గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న గంజాయి సాగు ఇప్పుడు నెల్లూరు జిల్లాలో కలకలం రేపుతోంది.
డ్రోన్ నిఘాతో ఈ అక్రమ సాగు గుట్టు రట్టయింది. అసలు ఈ సాగు వెనుక ఉన్నదెవరు? ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు? వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ..గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన ప్రాంతాల్లోనే ఏకంగా గంజాయి సాగుకు తెరలేపిన ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగుచూసింది. ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు మండల కేంద్రానికి సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఈ అక్రమ సాగును పోలీసులు గుర్తించారు.గ్రామ శివారులో జూదం, మద్యం సేవించే ప్రాంతాలపై డ్రోన్ నిఘా పెట్టిన పోలీసులకు పచ్చని పంటల మధ్య అనుమానాస్పదంగా కనిపించిన తోటపై సందేహం కలిగింది.
డ్రోన్ ద్వారా మరోసారి చిత్రీకరించిన దృశ్యాలను పరిశీలించి, ఎక్సైజ్ ఈగల్ బృందానికి పంపగా.. అక్కడ సాగవుతున్నది గంజాయిగా గుర్తించారు. దీంతో పోలీసులు తోటపై దాడులు నిర్వహించి, ప్రధాన నిందితుడితో పాటు సాగులో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకున్నారు.దాదాపు తొమ్మిది ఎకరాల విస్తీర్ణం ఉన్న భూమిని లీజుకు తీసుకున్న వెంకటసుబ్బారెడ్డి.. అందులో సుమారు రెండు ఎకరాల్లో గంజాయి సాగు చేసినట్లు అధికారులు గుర్తించారు.
పొలం చుట్టూ వెదురు కంచె ఏర్పాటు చేసి, గంజాయి మొక్కలు బయటకు కనిపించకుండా కంది, మొక్కజొన్న పంటల మధ్య అంతర పంటగా సాగు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ తోటలో 1,730 గంజాయి మొక్కలతో పాటు మరో 450 చిన్న మొక్కలను అధికారులు గుర్తించినట్లు సమాచారం.జిల్లా ఎస్పీ డాక్టర్ రజిత వేజెండ్ల, ఈగల్ ఎస్పీ ఉమామహేశ్వరరావు తోటను పరిశీలించి వివరాలు సేకరించారు. నిందితుడు అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన ఆరుగురిని తీసుకొచ్చి ఈ సాగు చేపట్టినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం.
ప్రధాన నిందితుడితో పాటు సాగులో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఈ అక్రమ సాగు వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? గంజాయిని ఎక్కడికి తరలించేందుకు ప్రణాళిక రచించారు? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.పచ్చని పంటల మాటున సాగుతున్న ఈ గంజాయి వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.




