Nellore: కోవూరులో ప్రశాంతంగా స్థానిక సంస్థల పోలింగ్ పూర్తి!
Nellore: కోవూరు నియోజకవర్గంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. వర్షంలోనూ వివిధ గ్రామాల పోలింగ్ కేంద్రాలను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పరిశీలించారు.
Nellore: కోవూరులో ప్రశాంతంగా స్థానిక సంస్థల పోలింగ్ పూర్తి!
నెల్లూరు: కోవూరు నియోజకవర్గంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఎన్నికల ప్రక్రియను శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షించారు. ఎన్నికల ప్రక్రియ సాగిన తీరును తెలుసుకునేందుకు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఓ వైపు వర్షం కురుస్తున్నప్పటికీ ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఎమ్మెల్యే వివిధ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.
నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి, స్థానిక నాయకులతో మాట్లాడి అక్కడి పోలింగ్ సరళిని తెలుసుకున్నారు. అధికారులను అడిగి పోలింగ్ శాతంపై వివరాలు సేకరించారు. కోవూరులోని శాంతినగర్, పడుగుపాడులోని టీఎన్‌సీ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఎన్నికల నిర్వహణ తీరును ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పరిశీలించారు.
అలాగే, కొడవలూరు మండలంలోని నార్త్ రాజుపాళెం, విడవలూరు, అన్నారెడ్డిపాళెం, ముదివర్తి, ఊటుకూరు, రామతీర్థం గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఆయా ప్రాంతాల్లో పోలింగ్ సరళిపై ఆరా తీశారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ అధికారులు, స్థానిక నాయకులతో నిరంతరం సంప్రదింపులు జరిపి ఎన్నికల పరిస్థితులను సమీక్షించారు.




