Nellore: రక్తప్రసరణ తగ్గితే కాళ్లు, చేతులు కోల్పోయే ప్రమాదం
Nellore: జాతీయ వాస్కులర్ సర్జరీ దినోత్సవం సందర్భంగా నెల్లూరు మెడికవర్ హాస్పిటల్స్ వాస్కులర్ సర్జన్ డా. వై. సుదర్శన్ రెడ్డి కీలక సూచనలు.
Nellore: రక్తప్రసరణ తగ్గితే కాళ్లు, చేతులు కోల్పోయే ప్రమాదం
నెల్లూరు: రక్తప్రసరణ తగ్గితే కాళ్లు, చేతులు కోల్పోయే ప్రమాదం ఉందని, జాతీయ వాస్కులర్ సర్జరీ దినోత్సవం సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో వైద్యుల అవగాహన కార్యక్రమంలో భాగంగా చెప్పారు.
రమేష్ (52) రోజువారీ కూలీ పని ఒత్తిడిని మరిచిపోవడానికి ప్రతిరోజూ బీడీలు తాగడం అతని అలవాటని, షుగరు వ్యాధి కూడా ఉండటంతో కొంతకాలంగా నడిచినప్పుడల్లా కాళ్లలో నొప్పి వస్తున్నా, అది పని వల్లేనని భావించి నిర్లక్ష్యం చేశాడని, కాలక్రమేణా కాళ్ల వేళ్లు నల్లగా మారి చివరకు వాటిని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు..
ఇలాంటి సంఘటనలు నేడు చాలా మందిలో కనిపిస్తున్నాయని, పొగాకు అలవాట్లు మరియు మధుమేహం కలిసి శరీరంలోని రక్తనాళాలను తీవ్రంగా దెబ్బతీసి చేతులు, కాళ్లకు రక్తప్రసరణను తగ్గించి అవయవాలు కోల్పోయే ప్రమాదాన్ని పెంచుతున్నాయని మెడికవర్ హాస్పిటల్, నెల్లూరు కన్సల్టెంట్ వాస్కులర్ & ఎండోవాస్కులర్ సర్జన్ డా. వై. సుదర్శన్ రెడ్డి తెలిపారు.
సిగరెట్లు, బీడీలు తాగడం వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం గురించి చాలా మందికి అవగాహన ఉన్నప్పటికీ, అదే అలవాటు రక్తనాళాలను మూసివేసి కాళ్లు, చేతులకు రక్తప్రసరణ తగ్గే ప్రమాదం గురించి మాత్రం చాలా తక్కువ మందికే తెలుసన్నారు. ఈ అవగాహన లోపం కారణంగా కుటుంబాన్ని పోషించే వయసులోనే అనేక మంది కాళ్లు, వేళ్లు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ప్రజల్లో రక్తప్రసరణ సంబంధిత వ్యాధులపై అవగాహన పెంచేందుకు ప్రతి సంవత్సరం ఆగస్టు 6న "జాతీయ వాస్కులర్ సర్జరీ దినోత్సవం" (National Vascular Surgery Day) ను వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోందన్నారు.
"రక్తప్రసరణ ఎందుకు తగ్గుతుంది?"
డా. సుదర్శన్ రెడ్డి వివరించిన ప్రకారం, పొగలోని నికోటిన్ మరియు ఇతర హానికర రసాయనాలు రక్తనాళాలను కుంచించుకుపోయేలా చేస్తాయి. నికోటిన్ రక్తాన్ని చిక్కగా మార్చి రక్తప్రవాహాన్ని మందగింపజేస్తుంది. మరోవైపు మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ కారణంగా రక్తనాళాల గోడల్లో కొవ్వు పేరుకుపోయి అవి సన్నబడతాయి. దీంతో శరీర భాగాలకు అవసరమైన రక్తం చేరక కణజాలం దెబ్బతింటుంది.
"ప్రారంభ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు"
రక్తప్రసరణ తగ్గుతున్నప్పుడు మొదట కొంతదూరం నడిచిన తర్వాత కాళ్లలో నొప్పి వచ్చి ఆగాల్సి రావడం, చేతులతో పని చేసినప్పుడు నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తరువాత వేళ్లలో తీవ్రమైన మంట, విశ్రాంతి సమయంలో కూడా నొప్పి, రాత్రిళ్లు నిద్రపట్టకపోవడం వంటి సమస్యలు వస్తాయి. పరిస్థితి మరింత విషమిస్తే వేళ్లు నల్లగా మారడం, పుండ్లు ఏర్పడడం, గాయాలు మానకపోవడం జరుగుతుందని తెలిపారు.
"ముందుగానే చికిత్స తీసుకుంటే అవయవాలను కాపాడుకోవచ్చు"
ప్రారంభ దశలోనే సమస్యను గుర్తిస్తే మందులతోనే రక్తప్రసరణను మెరుగుపరచవచ్చని డా. సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఒకవేళ వేళ్లు నల్లబడే స్థాయికి చేరుకున్నప్పటికీ, ఆధునిక వాస్కులర్ మరియు ఎండోవాస్కులర్ శస్త్రచికిత్సల ద్వారా రక్తప్రసరణను పునరుద్ధరించి అనేక సందర్భాల్లో కాళ్లు, వేళ్లను పూర్తిగా తొలగించకుండా కాపాడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
ఒక వ్యక్తి కాలు కోల్పోతే అతని జీవన నాణ్యతతో పాటు ఆయుర్దాయం కూడా గణనీయంగా ప్రభావితమవుతుందని, సరైన సమయంలో వాస్కులర్ సర్జన్‌ను సంప్రదించడం ద్వారా తీవ్రమైన సమస్యలను నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు.
రక్తప్రసరణ సమస్యలు రాకుండా ఉండాలంటే... షుగరు మరియు కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుకోవాలి. సిగరెట్లు, బీడీలు మరియు ఇతర పొగాకు ఉత్పత్తులను పూర్తిగా మానేయాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కాళ్లలో నొప్పి, మంట, గాయాలు మానకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వాస్కులర్ సర్జన్‌ను సంప్రదించాలని డా. వై. సుదర్శన్ రెడ్డి తెలిపారు.




