Nellore: యువత భవితకు పూర్తి భరోసా: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి!

Nellore: అసత్య ప్రచారాలు నమ్మొద్దు.. యువత భవిష్యత్తుకు పూర్తి భరోసా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి విద్యార్థులతో ముఖాముఖి, మెగా డీఎస్సీ, ఉద్యోగాలపై స్పష్టత.

A Praveen, Nellore
Published on: 28 Sept 2026 11:47 PM IST
Nellore
X

Nellore: యువత భవితకు పూర్తి భరోసా: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి!

నెల్లూరు: గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నియామకాల్లో భారీ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులకు ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేసే నైతిక హక్కు లేదని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అన్నారు. సోమవారం కందుకూరులోని టీఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాల, వివేక డిగ్రీ కళాశాల, కావలిలోని జవహర్‌ భారతి కళాశాల,

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ కళాశాలలో నిర్వహించిన ‘యువత భవితకు భరోసా’ కార్యక్రమాల్లో ఎంపీ గారు పాల్గొన్నారు. విద్యార్థులతో ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహించారు. యువతలో భవిష్యత్తుపై ఉన్న ఆందోళనలు, అపోహలు, సందేహాలను నివృత్తి చేసి వారిలో ఆత్మవిశ్వాసం నింపడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడులు, స్వయం ఉపాధి అవకాశాలపై విద్యార్థులతో చర్చించారు.

ఏపీపీఎస్సీ అక్రమాలపై సిట్‌ విచారణ

గత వైకాపా పాలనలో ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 జవాబు పత్రాలను స్ట్రాంగ్‌ రూమ్‌ నుంచి ప్రైవేటు రిసార్టుకు తరలించి, అక్రమ దిద్దుబాట్లకు పాల్పడ్డారనే ఆరోపణలపై విచారణ జరుగుతోందని ఎంపీ గారు తెలిపారు. వైకాపా నాయకులు మెగా డీఎస్సీపై దాఖలు చేసిన 355 పిటిషన్లను ఎదుర్కొని, ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారం ప్రక్రియను పూర్తి చేసిందని తెలిపారు. దాదాపు 42 వేల ప్రశ్నలతో కంప్యూటర్‌ ఆధారిత పద్ధతిలో ప్రశ్నపత్రాలను రూపొందించి, అత్యంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామని చెప్పారు. క్రీడల కోటాలో అర్హత సాధించిన ఉపాధ్యాయులు సైతం తమ ధ్రువపత్రాలను బహిరంగంగా చూపిస్తున్నారని, అయినప్పటికీ రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.

యువత భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం అండ

కూటమి ప్రభుత్వం కేవలం ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితం కాకుండా ప్రైవేటు రంగంలోనూ ఉపాధి అవకాశాల కల్పనకు ప్రాధాన్యమిస్తోందని ఎంపీ గారు వివరించారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల లక్ష్యానికి గాను ఇప్పటివరకు 7 లక్షల ఉద్యోగాలు కల్పించామని, ఏటా డీఎస్సీ నిర్వహణతో పాటు ఇప్పటికే దాదాపు 2,000 పోలీసు, దాదాపు 900 ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు ప్రకటనలు విడుదల చేశామని గుర్తుచేశారు.

జిల్లాలో బీపీసీఎల్‌, ఇండోసోల్‌, ఇఫ్కో కిసాన్‌, డిఫెన్స్‌ క్లస్టర్ల ద్వారా భారీ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు జరుగుతున్నాయని చెప్పారు. యువత ఉద్యోగార్థులుగానే కాకుండా చంద్రబాబు గారి ‘వన్‌ ఫ్యామిలీ వన్‌ ఎంట్రప్రెన్యూర్‌’ విజన్‌తో ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలను అభివృద్ధి చేస్తోందని తెలిపారు. ఉపాధి అవకాశాలతో పాటు యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడంపై కూటమి ప్రభుత్వం దృష్టి పెడుతోందని అన్నారు.

కందుకూరు టీఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థిని కోరిక మేరకు తరగతి గదుల సౌకర్యార్థం వీపీఆర్‌ ఫౌండేషన్‌ ద్వారా 40 సీలింగ్‌ ఫ్యాన్లను అందజేస్తున్నట్లు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి గారు ప్రకటించారు. కళాశాలలో విద్యార్థుల చిరకాల కోరికైన ఎన్‌సీసీ (జాతీయ క్యాడెట్‌ కోర్‌) యూనిట్‌ను త్వరలోనే పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.

A Praveen, Nellore

A Praveen, Nellore