Nellore: నెల్లూరులో తాగునీటి సరఫరాపై కమిషనర్ పర్యవేక్షణ
Nellore: నెల్లూరు కమిషనర్ వై.ఓ. నందన్ తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులను పరిశీలించి అధికారులకు కీలక సూచనలు చేశారు.
Nellore
Nellore: నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ తాగునీటి సరఫరా వ్యవస్థపై సమగ్ర పర్యవేక్షణ చేపట్టారు. మెగా ఇంజనీరింగ్ వర్క్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న తాగునీటి సరఫరా పనుల పరిశీలనలో భాగంగా 36వ డివిజన్ పరిధిలోని బ్రహ్మానందపురం, అంబేద్కర్ నగర్ ప్రాంతాలను మంగళవారం అధికారులతో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా తాగునీటి సరఫరా నిర్వహణ తీరును పరిశీలించిన కమిషనర్, స్థానిక ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. తాగునీటి నాణ్యతను ప్రజల సమక్షంలోనే పరీక్షించి ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.
డివిజన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న భవనాలపై పట్టణ ప్రణాళిక విభాగం అనుమతులను పరిశీలించి, నగరపాలక సంస్థ అనుమతుల మేరకే నిర్మాణాలు చేపట్టేలా టౌన్ ప్లానింగ్ అధికారులకు సూచనలు జారీ చేశారు.
అలాగే పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి సారించిన కమిషనర్, డివిజన్ పరిధిలోని రోడ్లను ప్రతిరోజూ శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని, డ్రైనేజీ కాలువల పూడికతీత, వ్యర్థాల తొలగింపును క్రమం తప్పకుండా నిర్వహించాలని శానిటేషన్ విభాగం అధికారులను ఆదేశించారు.
ప్రతి భవనాన్ని ఆస్తి పన్ను పరిధిలోకి తీసుకువచ్చి పన్నుల వసూళ్లను పూర్తి స్థాయిలో చేపట్టాలని కూడా సూచించారు.
ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ విభాగం ఎస్.ఈ మోహన్, ఈ.ఈ, డి.ఈలు, మెగా వాటర్ టీమ్, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం డి.ఈ రఘురాం, టౌన్ ప్లానింగ్ అధికారులు, పబ్లిక్ హెల్త్ సిబ్బంది, వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.




