Nellore: అనుమతి లేకుండా ఫ్లెక్సీలు పెడితే చర్యలు: జేసీ హెచ్చరిక!

Nellore: నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటించాలని రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ ఎం. వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 25 Oct 2026 10:05 PM IST
Nellore
X

Nellore: అనుమతి లేకుండా ఫ్లెక్సీలు పెడితే చర్యలు: జేసీ హెచ్చరిక!

నెల్లూరు: నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు చేసేలా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని, మేయర్ అభ్యర్థి ఎన్నికల రిటర్నింగ్ అధికారి,జాయింట్ కలెక్టర్ ఎం. వెంకటేశ్వర్లు సూచించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహించేందుకు నిబంధనల ప్రకారం తప్పనిసరిగా అనుమతులు పొందాలని స్పష్టం చేశారు.

ఆదివారం నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, కమిషనర్ వై.ఓ. నందన్‌తో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు, జిల్లా ఎన్నికల అధికారి సూచనలకు అనుగుణంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని తెలిపారు.

అనుమతులు లేకుండా రాజకీయ పార్టీల ప్రచార హోర్డింగులు, ఫ్లెక్సీలు, ఇతర ప్రచార సామగ్రిని ప్రదర్శించరాదని స్పష్టం చేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, భయభ్రాంతులకు గురిచేయడం, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

లౌడ్‌స్పీకర్ల వినియోగం, తాత్కాలిక పార్టీ కార్యాలయాల ఏర్పాటు, ఇంటింటి ప్రచారం, ర్యాలీల నిర్వహణ, కరపత్రాల పంపిణీ, జెండాలు, బ్యానర్ల ప్రదర్శన, ప్రచార వాహనాలకు అనుమతులు, ఎన్నికల వ్యయాల నమోదు తదితర అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎన్నికల సంఘం నిబంధనలను వివరించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు అడిగిన సందేహాలను అధికారులు నివృత్తి చేశారు.

ఎన్నికల ప్రక్రియ ఆద్యంతం ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగేందుకు, ఓటర్లందరూ ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జాయింట్ కలెక్టర్ కోరారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE