Nellore: నగరాభివృద్ధికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు: మేయర్ సుజాత!
Nellore: నెల్లూరు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో మేయర్ దేవరకొండ సుజాత తన 9 నెలల పాలనలో రూ.334.59 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల నివేదికను ప్రకటించారు.
Nellore: నగరాభివృద్ధికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు: మేయర్ సుజాత!
నెల్లూరు: నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లకు సమాన ప్రాధాన్యత కల్పిస్తూ మౌలిక వసతుల కల్పనతో పాటు వివిధ అభివృద్ధి పనులను పూర్తి చేయడంలో తన పాలనలో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని మేయర్ దేవరకొండ సుజాత హర్షం వ్యక్తం చేశారు.
కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో నెల్లూరు నగరపాలక సంస్థ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని మేయర్ సుజాత అధ్యక్షతన శనివారం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు. సమావేశంలో ప్రవేశపెట్టిన 41 అజెండాలు, 3 టేబుల్ అజెండాలను సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రివర్యులు డాక్టర్ పి. నారాయణ, రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ల సారధ్యంలో వారి సహకారంతో నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో వివిధ రకాల అభివృద్ధి పనులను చేపట్టి ప్రజలకు మరింత మెరుగైన మౌలిక వసతులను కల్పించడంలో సఫలీకృతమయ్యానని ప్రకటించారు.
మేయర్ గా తన పరిపాలన కాలంలో నెల్లూరు నగర పాలక సంస్థలో చేపట్టిన మౌలిక సదుపాయాల అభివృద్ధిపై సమగ్ర నివేదికను వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన HAM (మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు) ప్రాజెక్టు ద్వారా నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో సుమారుగా 240 కోట్ల రూపాయలు.
6.29 కోట్లతో సిసి రోడ్లు, 1.94 కోట్లతో సిసి డ్రెయిన్లు మరియు కల్వర్టులు, 4.04 కోట్లతో వీధి దీపాలు, పార్కులు మరియు డివైడర్లు, 1.56 కోట్లతో సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్, 48 కోట్లతో UGD ఫేజ్ I, 7.43 కోట్లతో స్మశానవాటికలు, షాదీ మంజిల్, ప్రహరీ గోడలు, మరుగుదొడ్లు, తరగతి గదులు, సచివాలయ భవనాలు మరియు ఇతర పనులు 2 కోట్లతో ట్రాఫిక్ సిగ్నల్స్, 17.77 కోట్లతో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ 5.56 కోట్ల రూపాయలతో ఇ-ఆటోలు, ఛార్జింగ్ స్టేషన్లు మరియు ఇతర వాహనాల ఏర్పాటు.
మొత్తం 9 నెలల పాలనలో 334.59 కోట్ల రూపాయలతో నగర పాలక సంస్థ పరిధిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను చేపట్టి పూర్తి చేశామని మేయర్ ప్రకటించారు. ఇందుకు సహకరించిన సహచర కార్పొరేటర్లు, కో ఆప్షన్ మెంబర్లు, డివిజన్ల నాయకులు, నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్, అన్ని విభాగాల అధికారులు, సిబ్బందికి ప్రత్యేకంగా మేయర్ కృతజ్ఞతలు తెలియజేసారు.
అదేవిధంగా నెల్లూరు నగరపాలక సంస్థ 2021 - 26 పాలకమండలి సభ్యుల పదవీకాలం పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని సమావేశంలో భాగంగా నిర్వహించారు.
రూరల్ ఎమ్మెల్యే, కమిషనర్ వై.ఓ నందన్, డిప్యూటీ మేయర్లు సభ్యులందరికీ పురస్కారాలను ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్లు రూప్ కుమార్ యాదవ్, సయ్యద్ తహసీన్, కో ఆప్షన్ సభ్యులు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




