Nellore: ఆపరేషన్ చిన్నారి తల్లి.. పోలీసుల విస్తృత అవగాహన

Nellore: నెల్లూరు ఎస్పీ అజిత ఆదేశాల మేరకు నర్సింగ్ విద్యార్థినులకు ఆపరేషన్ చిన్నారి తల్లి, ఆపరేషన్ దండాయన పోలీసులు సమగ్ర అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

V. Narasimhulu, Nellore
Published on: 2 Jun 2026 9:25 PM IST
Nellore
X

Nellore: ఆపరేషన్ చిన్నారి తల్లి.. పోలీసుల విస్తృత అవగాహన

Nellore: మహిళలు, బాలల భద్రత కోసం “ఆపరేషన్ చిన్నారి తల్లి”, “ఆపరేషన్ దండాయన”పై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు నెల్లూరు పోలీసులు జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ (అడ్మిన్) సూచనలతో, నెల్లూరు టౌన్ ఏఎస్పీ దీక్ష, పర్యవేక్షణలో శక్తి బృందాలు ఈ రోజు దర్గామిట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని సెయింట్ జోసెఫ్ నర్సింగ్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న నర్సింగ్ విద్యార్థినులకు “ఆపరేషన్ చిన్నారి తల్లి”, “ఆపరేషన్ దండాయన” మరియు మహిళల భద్రత కోసం రూపొందించిన “శక్తి” యాప్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించాయి.

ఈ సందర్భంగా ప్రతి మహిళ తన మొబైల్ ఫోన్‌లో శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని వినియోగించుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. యాప్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయాన్ని సులభంగా పొందవచ్చని తెలియజేశారు. “ఆపరేషన్ చిన్నారి తల్లి” మరియు “ఆపరేషన్ దండాయన” కార్యక్రమాలు పిల్లలు, మహిళలపై జరిగే లైంగిక నేరాలను అరికట్టడం, వారి భద్రతను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక చర్యలు అని వివరించారు.

“సురక్షిత బాల్యం – స్థిరమైన అభివృద్ధి” అనే నినాదంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ్యం పిల్లలు, మహిళలపై జరిగే నేరాలను నిరోధించడం, నేరస్థులను గుర్తించి కఠినంగా శిక్షించడం మరియు బాధితులకు తగిన రక్షణ కల్పించడం అని తెలిపారు. అలవాటుగా లైంగిక నేరాలకు పాల్పడేవారు, మాదకద్రవ్యాల వినియోగదారులు మరియు పిల్లలు, మహిళలకు హాని కలిగించే అసాంఘిక శక్తులపై ప్రత్యేక నిఘా ఉంచి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అలాగే లైంగిక నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి రాత్రి వేళల్లో ప్రత్యేక గస్తీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాల నిరోధం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, వెట్టిచాకిరీ నిర్మూలన, మానవ అక్రమ రవాణా నిరోధం, పోక్సో చట్టం, మాదకద్రవ్యాల నియంత్రణ, అత్యవసర సేవల కోసం డయల్ 100, 112, మహిళల హెల్ప్‌లైన్ 181, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, సైబర్ మోసాల ఫిర్యాదుల కోసం 1930 వంటి అంశాలపై విద్యార్థినులకు సమగ్ర అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమాన్ని దర్గామిట్ట పోలీస్ స్టేషన్ సీఐ బి. కళ్యాణ్ రాజు మరియు మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో దర్గామిట్ట ఎస్‌ఐ ప్రభాకర్, సెయింట్ జోసెఫ్ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ అమల జేవియర్, ట్యూటర్ చిన్నారి, మహిళా పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ రమణయ్య, శక్తి బృంద సభ్యులు, కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story