Nellore: 69, 70 డివిజన్లలో పొంగూరు రమాదేవి జోరుగా ఎన్నికల ప్రచారం!

Nellore: నెల్లూరు 69, 70 డివిజన్లలో మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి ప్రచారం. మేయర్ అభ్యర్థి రూప్ కుమార్, కార్పొరేటర్ అభ్యర్థులకు భారీ మెజార్టీ ఇవ్వాలని పిలుపు.

V. Narasimhulu, Nellore
Published on: 24 Oct 2026 9:57 PM IST
Nellore
X

Nellore: 69, 70 డివిజన్లలో పొంగూరు రమాదేవి జోరుగా ఎన్నికల ప్రచారం!

నెల్లూరు: నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారం రోజురోజుకూ వేడెక్కుతోంది. భారీ మెజారిటీనే లక్ష్యంగా పెట్టుకున్న మంత్రి నారాయణ కుటుంబం ప్రచారంలో దూకుడు పెంచింది. తొలి విడతలో నెల్లూరు సిటీలోని 36 డివిజన్లను చుట్టేసింధి మంత్రి కుటుంబం.ప్రజలతో నేరుగా మమేకమవుతూ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

శనివారం 69, 70వ డివిజన్లలో మంత్రి సతీమణి పొంగూరు రమాదేవి నిర్వహించిన ఎన్నికల ప్రచారం, రోడ్‌షోలకు విశేష స్పందన లభించింది.సాధారణ వ్యక్తుల్లా ప్రజల్లో కలిసిపోతూ, ఆత్మీయంగా పలకరిస్తూ ఓటర్లకు చేరువవుతున్న రమాదేవి ప్రచారం కూటమి శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

కార్పొరేటర్‌ అభ్యర్థులు షేక్‌ షాహీనా, రాచగిరి చంద్రశేఖర్‌తో పాటు మేయర్‌ అభ్యర్థి రూప్‌కుమార్‌ యాదవ్‌కు మద్దతుగా కార్యకర్తలు, టీడీపీ అభిమానులు పెద్ద ఎత్తున కదం తొక్కారు. రోడ్‌షోలో పార్టీ శ్రేణుల కోలాహలం కనిపించగా, ఇంటింటి ప్రచారంలో స్థానికులతో రమాదేవి మమేకమవుతూ అభ్యర్థులకు మద్దతు కోరారు. ..నెల్లూరులో మంత్రి నారాయణ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే కూటమి అభ్యర్థుల విజయానికి బలమైన పునాది అవుతాయని రమాదేవి పేర్కొన్నారు.

ఏ డివిజన్‌కు వెళ్లినా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని, నగరంలో అభివృద్ధి పనులు వేగం పుంజుకోవడంతో కూటమికి మద్దతు తెలిపేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఓటర్లను కలుస్తున్నామని, నగర ప్రగతి కొనసాగాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

69, 70వ డివిజన్లలో రమాదేవి ప్రచారంతో కూటమి శ్రేణుల్లో ఎన్నికల జోష్‌ మరింత పెరిగింది. అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కార్యకర్తలు సమన్వయంతో ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ తమకు అనుకూల వాతావరణాన్ని సూచిస్తోందని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.నగరపాలక సంస్థ పరిధిలోని మొత్తం 72 డివిజన్లలోనూ విజయం సాధించడమే లక్ష్యమని రమాదేవి పేర్కొన్నారు.

మేయర్‌ అభ్యర్థి రూప్‌కుమార్‌ యాదవ్‌ బంపర్‌ మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూ, కార్పొరేటర్‌ అభ్యర్థులు షేక్‌ షాహీనా, రాచగిరి చంద్రశేఖర్‌లను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తొలి విడత ప్రచారంతో ఊపందుకున్న కూటమి రెండో విడత ప్రచారంలోనూ ఇదే దూకుడు కొనసాగించే దిశగా అడుగులు వేస్తోంది.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore