Nellore: నెల్లూరు గణేశ్ ఘాట్ వద్ద అంగరంగ వైభవంగా నదీ హారతి!
Nellore: నెల్లూరు గణేశ్ ఘాట్ వద్ద నదీ హారతి ఆధ్యాత్మిక శోభ తెచ్చిందని, కూటమి ప్రభుత్వం ఈ సంప్రదాయాన్ని పునరుద్ధరించిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.
Nellore: నెల్లూరు గణేశ్ ఘాట్ వద్ద అంగరంగ వైభవంగా నదీ హారతి!
Nellore: "గణేశ్ ఘాట్‌లో అంగరంగ వైభవంగా నదీ హారతి"
నెల్లూరు ఇరుగాలమ్మ గుడి సమీపంలోని గణేశ్ ఘాట్ వద్ద ఐదు రోజులుగా విక్రమ సింహపురి గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాలకు పవిత్ర నదీ హారతి కార్యక్రమం మరింత ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.
శుక్రవారం సాయంత్రం గణేష్ ఘాట్ వద్ద నిర్వహించినది హారతి కార్యక్రమంలో మంత్రి ఆనం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ... విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం నుంచి విచ్చేసిన వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ స్వర్ణాల చెరువు వద్ద పవిత్ర హారతులు సమర్పించడం ద్వారా నెల్లూరు ప్రజలకు సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించామని మంత్రి పేర్కొన్నారు. నదీ హారతి కార్యక్రమాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో వీక్షించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు.
కృష్ణా, గోదావరి పుష్కరాల సందర్భంగా ప్రారంభమైన పవిత్ర నదీ హారతుల సంప్రదాయాన్ని కూటమి ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించిందని తెలిపారు. రాజమహేంద్రవరంలో గోదావరికి, విజయవాడలో కృష్ణానదికి నిత్యం నదీ హారతులు నిర్వహిస్తున్నామని, అదే పవిత్ర సంప్రదాయంలో భాగంగా నెల్లూరులో నదికి హారతి నిర్వహించడం ఎంతో విశేషమన్నారు.
"భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు"
గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు నిర్వహించిన వినాయక ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి సోదరుల పర్యవేక్షణలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారని పేర్కొన్నారు.
"నిరంతరం ప్రసాదాల పంపిణీ"
ఉత్సవాల సందర్భంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తులకు నిరంతరం ప్రసాదాల పంపిణీ చేపట్టామని మంత్రి తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అవసరమైన అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేశామని పేర్కొన్నారు.
"సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రత్యేక ఆకర్షణ"
వినాయక ఉత్సవాల్లో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా భక్తులకు ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదాన్ని అందించామని మంత్రి తెలిపారు. గణేశ్ ఘాట్ వద్ద జరిగిన కార్యక్రమాలు ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని పేర్కొన్నారు.
"నదులు జలకళతో పరవళ్లు తొక్కాలి"
నదులు ఎల్లప్పుడూ జలకళతో పరవళ్లు తొక్కాలని, రాష్ట్ర రైతాంగానికి సాగునీరు, ప్రజలకు తాగునీటికి ఎలాంటి కొరత లేకుండా నదీమతల్లుల ఆశీస్సులు ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రజలందరి ఇళ్లలో సుఖశాంతులు వెల్లివిరియాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. మంత్రికి విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.




