Nellore: నెల్లూరు జిల్లాలో నేటి నుంచే సమగ్ర ఓటరు జాబితా సవరణ

Nellore: నెల్లూరు జిల్లాలో భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమం ప్రారంభమైంది.

V. Narasimhulu, Nellore
Published on: 14 Jun 2026 6:35 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు జిల్లాలో నేటి నుంచే సమగ్ర ఓటరు జాబితా సవరణ

Nellore: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 2026 జూలై 1ను అర్హత తేదీగా పరిగణిస్తూ ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని జిల్లాలో విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు నెల్లూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలో 9,62,575 పురుషులు, 10,11,452 మహిళలు, 213 ఇతరులు కలిపి మొత్తం 19,74,240 మంది ఓటర్లు ఉన్నారని, వీరి వివరాల పరిశీలన కోసం 2,352 మంది బూత్ స్థాయి అధికారులు (BLOలు) నియమించబడినట్లు పేర్కొన్నారు.

ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం నిర్వహించబడుతుందని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు జూన్ 15 నుండి జూలై 14 వరకు ఇంటింటి సర్వే నిర్వహించి ఓటర్ల వివరాలను సేకరిస్తారని చెప్పారు. అనంతరం సేకరించిన వివరాల ఆధారంగా ముసాయిదా ఓటరు జాబితా జూలై 21న ప్రచురించబడుతుందని వెల్లడించారు.

ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, క్లెయిమ్‌లు స్వీకరణకు జూలై 21 నుండి ఆగస్టు 20 వరకు అవకాశం కల్పించబడుతుందని తెలిపారు. నోటీసుల జారీ, క్లెయిమ్‌లు మరియు అభ్యంతరాల పరిష్కారం ప్రక్రియ సెప్టెంబర్ 18 వరకు కొనసాగుతుందని, తుది ఓటరు జాబితా సెప్టెంబర్ 22న ప్రచురించబడుతుందని పేర్కొన్నారు.

ఇంటింటి సర్వే సందర్భంగా బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికీ సంప్రదించి అవసరమైన వివరాలను సేకరిస్తారని తెలిపారు. ఓటర్లు తమ వివరాలను ధృవీకరించుకుని, పేర్లు చేర్పించడం, తొలగించడం లేదా సవరణలు చేయించుకోవడం కోసం సహకరించాలని కోరారు. ఓటరు జాబితాకు సంబంధించిన సమాచారం, దరఖాస్తుల కోసం ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌ను వినియోగించుకోవచ్చన్నారు.

ప్రజలకు సౌకర్యంగా జిల్లాలోని నియోజకవర్గ స్థాయిలో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓటర్లు తమ సందేహాలు, అభ్యంతరాలు లేదా ఇతర వివరాల కోసం సంబంధిత హెల్ప్ డెస్క్‌లను సంప్రదించవచ్చని సూచించారు. అలాగే ఓటరు హెల్ప్‌లైన్ నంబర్ 1950 ద్వారా కూడా సమాచారం పొందవచ్చన్నారు.

ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని రాజకీయ పార్టీలు, బూత్ లెవల్ ఏజెంట్లు (BLAs), ప్రజాప్రతినిధులు మరియు ప్రజలు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story