Nellore: వాటర్ బేస్ కంపెనీ మూసివేస్తే మాకు ఆత్మహత్యలే శరణం
Nellore: నెల్లూరు జిల్లా వరకవిపూడి వాటర్ బేస్ ఆక్వా కంపెనీని మూసివేస్తే 2 వేల మంది కార్మికులం రోడ్డున పడతామని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.
Nellore: వాటర్ బేస్ కంపెనీ మూసివేస్తే మాకు ఆత్మహత్యలే శరణం
నెల్లూరు జిల్లా: తోటపల్లి గూడూరు మండలం వరకవిపూడి పంచాయతీలోని వాటర్ బేస్ కంపెనీ 33 సంవత్సరాలుగా స్థానిక గ్రామ ప్రజలకు ఉపాధి కల్పిస్తూ ఉన్నది. వాటర్ బేస్ ఆక్వా ప్లాంట్ కంపెనీ ద్వారా వేలాదిమంది కార్మికులు స్థానికంగా ఉపాధి అవకాశాలు ఉపయోగించుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు.
ప్రతి దినం రెండు వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు.అదే విధంగా అత్యవసర పరిస్థితులలో 100 మంది అదనంగా పనిచేస్తూ ఉపాధి ద్వారా తమ కుటుంబాలను నడుపుకుంటున్నారు.
ఇటీవల కొందరు ఈ వాటర్ బేస్ ద్వారా కాలుష్యం వస్తుందంటూ దీనిని మూసివేయాలని ఆందోళన వ్యక్తం చేయడం ఇక్కడ పనిచేస్తున్న వేలాదిమంది కార్మికుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ విషయమై వాటర్ బేస్ కంపెనీ వద్ద కార్మికులు మీడియా సమావేశం నిర్వహించారు.
కంపెనీ ద్వారా ఎలాంటి కాలుష్యం లేదని కంపెనీ ఎప్పటికప్పుడు వాటికి తగ్గ నివారణ చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కంపెనీ ద్వారా అనేక ఆక్వా ఉత్పత్తులు జరుగుతున్నాయని అన్నారు. వాటర్ బేస్ ఎండి కృషితో ఈ కంపెనీ ఎంతో ఉన్నత స్థానంలో ఉందన్నారు.
ఇటువంటి ఆరోపణలు చేయడం తగదని కార్మిక భవిష్యత్తుకు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. వాటర్ బేస్ కంపెనీ ఆపివేస్తే కార్మికులు జీవనోపాధి కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ ఆపివేయాలని పలువురు ప్రయత్నిస్తున్నారని అలా ఆపివేస్తే మా కుటుంబ సభ్యులు జీవనోపాధి కోల్పోయి రోడ్డు మీద పడతామని, ఈ ఉపాధి కోల్పోతే ఆత్మహత్యలే శరణమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక్కడ కార్మికులు సుమారు 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వారు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ కంపెనీ ద్వారా గత 33 సంవత్సరాలుగా లేని కాలుష్యం ఇప్పుడు ఎలా ఉన్నదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి కంపెనీ మూసివేయాలి అనే ప్రయత్నాన్ని విరమించుకోవాలని కార్మికులు కోరుతున్నారు.
ఈ కంపెనీల ద్వారా జీవనోపాధి కలిగించాలే కానీ అనవసర రాజకీయాలు చేసి కార్మికుల పొట్ట కొట్టడం సరికాదని అన్నారు. ఈ వాటర్ బేస్ కంపెనీలో ఎక్కువమంది మహిళా కార్మికులు ఉన్నారు. ఈ నిరసన లో వేలాది మంది కార్మికులు పాల్గొన్నారు.




