Allur: గొంతు ఎండుతోంది.. గుక్కెడు నీళ్లివ్వండి: యానాదుల ఆక్రందన

Allur: తీవ్ర తాగునీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు.

U.L. NARASIMHULU, NELLORE
Updated on: 5 Oct 2026 6:32 PM IST
Allur
X

Allur: గొంతు ఎండుతోంది.. గుక్కెడు నీళ్లివ్వండి: యానాదుల ఆక్రందన

నెల్లూరు జిల్లా: అల్లూరు మండలంలోని గాలిదిబ్బలు, నాగులదేవిగుంట, చుక్కవానిదిబ్బ ప్రాంతాల్లో నెలకొన్న తీవ్ర తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలని డిమాండ్ చేస్తూ... యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్లకార్డులతో నిరసన చేపట్టారు.

అనంతరం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో యానాదుల సంక్షేమ సంఘం నాయకులు పలు సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు.

ముఖ్యంగా అల్లూరు మండలంలోని గాలిదిబ్బలు, నాగులదేవిగుంట, చుక్కవానిదిబ్బ ప్రాంతాల్లో గత అనేక సంవత్సరాలుగా తీవ్ర తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని నాయకులు తెలిపారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన సమయంలో మాత్రమే మొక్కుబడిగా నీటిని సరఫరా చేసి, ఆ తర్వాత సమస్యను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే ఆయా ప్రాంతాల్లో వీధి దీపాల సౌకర్యం లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తాగునీటి సమస్యకు తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

అదేవిధంగా రాపూరు మండలం గరిమేనపెంట గ్రామంలోని పొలాల సమస్య, సంగం మండలం వెంగారెడ్డిపాళెం గ్రామంలోని పొలాల సమస్య, అలాగే కావలి, జలదంకి మండలాల పరిధిలో గోల్డ్ లోన్‌లకు సంబంధించిన అవకతవకలపై కూడా అధికారులకు ఫిర్యాదులు సమర్పించారు.

ఈ సమస్యలపై అధికారులు సానుకూలంగా స్పందించి, మొత్తం ఏడు సమస్యలను త్వరలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు యానాదుల సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు.

అనంతరం యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రెస్‌మీట్ నిర్వహించి సమస్యల వివరాలను వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కే.సి. పెంచలయ్య యానాది, నెల్లూరు జిల్లా చైర్మన్ రాపూరు కృష్ణయ్య, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ తీరివీధి సతీష్ చంద్ర, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యల్లంపల్లి రమేష్, మహిళా విభాగం అధ్యక్షురాలు చెంబేటి ఉష, నెల్లూరు నగర అధ్యక్షురాలు కల్లూరు వరలక్ష్మి, జిల్లా నాయకురాలు చల్లంచర్ల తిరుపతమ్మ, జిల్లా నాయకులు పెంచలయ్య, స్థానికులు దాసరి అబ్బయ్య, భవాని, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

“యానాదుల తాగునీటి సమస్యకు తాత్కాలిక పరిష్కారం కాదు… శాశ్వత పరిష్కారం కావాలి!” ఆశాభావం వ్యక్తం చేశారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE