Nellore: అపోహలు నమ్మొద్దు.. ఇంధనం సరిపడా ఉంది.. కలెక్టర్ భరోసా
Nellore: నెల్లూరు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా స్పష్టం చేశారు.
Nellore: అపోహలు నమ్మొద్దు.. ఇంధనం సరిపడా ఉంది.. కలెక్టర్ భరోసా
Nellore: రామన్నపాలెం వద్ద పెట్రోల్ బంక్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు కలెక్టర్ హిమాన్షు శుక్లా. అన్ని బంకుల్లో సమృద్ధిగా నిల్వలు ఉన్నాయని, అపోహలు నమ్మి వినియోగదారులు ఒక్కసారిగా రావడం వల్లే తాత్కాలిక సమస్య తలెత్తిందని చెప్పారు. అన్ని ఆయిల్ కంపెనీల ట్యాంకర్లు కూడా మరికొన్ని గంటల్లోనే జిల్లాకు చేరుకుంటాయని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా.
జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో డీజిల్, పెట్రోల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని చెప్పారు. సోమవారం కొడవలూరు మండలం రామన్నపాలెం వద్ద ఉన్న జయ పెట్రోల్ బంక్‌ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెట్రోల్ బంక్ యజమాని సుమన్‌తో మాట్లాడి స్టాక్ వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం బంక్‌లో సరిపడా నిల్వలు ఉన్నప్పటికీ, ప్రజలు ఒక్కసారిగా భారీగా రావడం వల్ల తాత్కాలిక ఒత్తిడి ఏర్పడిందని యజమాని వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..
సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న అసత్య సమాచారం, అపోహలను ప్రజలు నమ్మవద్దని స్పష్టం చేశారు. జిల్లాలో ఎటువంటి కొరత లేదని, పుష్కలంగా డీజిల్, పెట్రోల్ నిల్వలు ఉన్నాయని తెలిపారు. మన జిల్లాకు కడప, చిత్తూరు, కృష్ణపట్నం పోర్టు ప్రాంతాల నుంచి నిరంతరంగా ఆయిల్ సరఫరా జరుగుతోందని, ఆయిల్ కంపెనీల ట్యాంకర్లు కూడా మరికొన్ని గంటల్లో జిల్లాకు చేరుకుంటాయని చెప్పారు.
ప్రజలు అపోహలకు లోనై అవసరానికి మించి పెట్రోల్ నిల్వ చేసుకోవాలని ఆలోచించడం వల్లే సమస్య తలెత్తుతోందని, ఇది కొరత కారణంగా కాదని వివరించారు. ఎవరు ఆందోళన చెందవద్దని, ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
ఇక జిల్లాలో మొత్తం 243 పెట్రోల్ బంకుల్లో సరిపడా నిల్వలు ఉన్నాయని, ప్రతి బంక్ వద్ద పరిస్థితిని ఎస్పీ, జాయింట్ కలెక్టర్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారని కలెక్టర్ తెలిపారు..కలెక్టర్ వెంట జిల్లా పౌరసరఫరాల అధికారి లీలారాణి, తహసీల్దార్ సుబ్బయ్య, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.




