Nellore: జగన్ కంటే తుగ్లక్కే నయం నుడా చైర్మన్ కోటంరెడ్డి తీవ్ర విమర్శలు

Nellore: మూడు రాజధానుల పేరుతో జగన్ రాష్ట్రాన్ని అయోమయంలో పడేశారన్న కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి. 2029లోనూ కూటమి ప్రభుత్వమే వస్తుందని ఎద్దేవా.

V. Narasimhulu, Nellore
Published on: 2 July 2026 6:40 PM IST
Nellore
X

Nellore: జగన్ కంటే తుగ్లక్కే నయం నుడా చైర్మన్ కోటంరెడ్డి తీవ్ర విమర్శలు

నెల్లూరు: జగన్ కంటే పిచ్చి తుగ్లక్కే నయం అని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విమర్శించారు. 2019 ఎన్నికల సమయంలో అమరావతినే రాజధానిగా చెబుతూ, అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారని విమర్శించారు. చరిత్రలో తుగ్లక్ ఒక్కసారి మాత్రమే రాజధానిని మార్చాడని, కానీ జగన్ మాత్రం మూడు రాజధానుల పేరుతో ప్రజలను అయోమయానికి గురిచేశారని అన్నారు.

2029 ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని జగన్ స్వయంగా తన ప్రెస్ మీట్ ద్వారా చెబుతున్నారని ఎద్దేవా చేశారు. నెల్లూరులోని ఎన్టీఆర్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.. అమరావతి అంటే ఇష్టం లేని జగన్ అక్కడికి రౌడీలను పంపించారని, అమరావతి పరిరక్షణ పేరుతో వచ్చిన వారిని రైతులే కోడిగుడ్లతో ఆందోళన చేసారని అన్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వైసీపీ వ్యవహరిస్తోందని ఆరోపించిన కోటంరెడ్డి... అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందుతుండటం జగన్‌కు నచ్చడం లేదన్నారు. పెట్టుబడిదారులు ఏపీకి రాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని కూడా విమర్శించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క కొత్త ఫ్యాక్టరీ కూడా తీసుకురాలేదని ఆరోపించిన ఆయన... పార్లమెంట్ చట్టబద్ధత కల్పించిన అమరావతిని మార్చే హక్కు జగన్‌కు లేదన్నారు.

ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో వైసీపీ నేతలు స్వేచ్ఛగా తిరుగుతున్నారని, కానీ తమ హయాంలో తనపై అప్పటి సీఐ రాములు నాయక్ ఆధ్వర్యంలో హత్యాయత్నం జరిగిందని ఆరోపించారు. తమది అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం నడిచే పాలన అని, వైసీపీది 'రాజారెడ్డి రాజ్యాంగం' అని విమర్శించారు. టీడీపీ కార్యకర్తలు తలచుకుంటే వైసీపీ నేతలు రోడ్డుపై తిరగలేరని, అయితే అలాంటి సంస్కృతి తమ పార్టీది కాదని కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వ్యాఖ్యానించారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story