Nellore: నెల్లూరులో కుప్పకూలిన పురాతన భవనం.. తప్పిన పెను ప్రమాదం!
Nellore: నెల్లూరులోని గుప్తా పార్కు సమీపంలో పురాతన భవనం కుప్పకూలింది. ప్రమాదాన్ని ముందుగా గుర్తించిన బాధితులు బయటకు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది.
Nellore: నెల్లూరులో కుప్పకూలిన పురాతన భవనం.. తప్పిన పెను ప్రమాదం!
నెల్లూరు:ప్రమాదం"నెల్లూరు నగరంలో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. సిటీలోని గుప్తా పార్కు సమీపంలోని యనమల వారి వీధిలో పురాతన భవనం కుప్పకూలింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
నాలుగు కుటుంబాలు నివాసం ఉన్న భవనం మొదట ఒకవైపు కృంగిపోయింది.. వెంటనే ఆందోళన చెందిన నివాసంలోని వారు, బయటకు పరుగెత్తి పోలీసులు, అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించారు. దాంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, మున్సిపల్ అధికారులు కలిసి, లోపల చిక్కుకున్న పలువురిని బయటకు తీశారు.
భవనం కూలిన ఘటనలో నలుగురికి స్వల్ప గాయాలు కాగా, వారిని వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వర్షాల సీజన్ మొదలవుతున్న వేళ, పురాతన భవనాలు, దెబ్బతిన్న కట్టల కట్టడాల వద్ద ఎవరు ఉండవద్దని నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు... భవనం కూలిన సమాచారాన్ని తెలుసుకున్న ఆయన వెనువెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. బాధితులను పరామర్శించారు.
మున్సిపల్ కమిషనర్ వైఓ నందన్, అదనపు ఎస్పీ సౌజన్య ,కూలిన భవనాన్ని పరిశీలించారు.. పూర్తిగా శిథిలాలను తొలగించే ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఆదేశించారు. జనం రద్దీగా ఉండే గుప్తా పార్కు సమీపంలో పురాతన భవనం కూలిపోవడంతో స్థానికులు కలవరపాటుకు గురయ్యారు. ఆ ప్రాంతాల్లో పాత భవనాల్లో ఉన్నవారు ఆందోళన చెందారు.




