Sullurpeta: సూళ్ళూరుపేటలో ఘనంగా ‘ఆపరేషన్ త్రిశూల్’ అవగాహన సదస్సు!

Sullurpeta: సూళ్ళూరుపేట మహదేవయ్య నగర్‌లో 'ఆపరేషన్ త్రిశూల్' ఆధ్వర్యంలో నేరాల నివారణపై అవగాహన. సైబర్ నేరాలు, మహిళా భద్రతపై అప్రమత్తం చేసిన పోలీసులు.

KKV Sudhakar, Sullurupeta
Published on: 29 Sept 2026 7:57 AM IST
Sullurpeta
X

Sullurpeta: సూళ్ళూరుపేటలో ఘనంగా ‘ఆపరేషన్ త్రిశూల్’ అవగాహన సదస్సు!

Sullurpeta: తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, నాయుడుపేట డిఎస్పీ జీ. చెంచుబాబు ఆధ్వర్యంలో మరియు సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఎం.మురళీకృష్ట పర్యవేక్షణలో ‘ఆపరేషన్ త్రిశూల్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని 17వ వార్డు అయిన మహదేవయ్య నగర్‌లో స్థానిక ప్రజలతో ప్రత్యేక అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు.

​ఈ సందర్భంగా సూళ్ళూరుపేట ఎస్సై జి.అజయ్ కుమార్ మాట్లాడుతూ — "సమాజంలో నేరాల నిర్మూలన, ప్రజల రక్షణే పోలీసు వ్యవస్థ ముఖ్య లక్ష్యం. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల భద్రత పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. వారికి ఎదురయ్యే వేధింపులు, ఆపద సమయాల్లో వెంటనే పోలీసులను ఆశ్రయించాలి. నేటి యువతను పట్టిపీడిస్తున్న గంజాయి, ఇతర మాదకద్రవ్యాల (డ్రగ్స్) దుర్వినియోగానికి దూరంగా ఉండాలి. మత్తు పదార్థాల విక్రయాలు లేదా వినియోగంపై సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలి" అని కోరారు.

​అలాగే, నిత్యం పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్సై హెచ్చరించారు. అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్, మెసేజ్‌లు నమ్మి ఓటీపీ (OTP)లు లేదా వ్యక్తిగత బ్యాంకు వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని మరియు మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. చట్టరీత్యా నేరమైన బాల్య వివాహాలను అడ్డుకోవాలని, ఆడపిల్లలను ఉన్నత చదువులు చదివించాలని పిలుపునిచ్చారు.

​రాబోయే ఎన్నికల నేపథ్యంలో వార్డు ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎస్సై అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసులు, మహిళలు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta