Nellore: ర్యాంకుల విచ్చలవిడి ప్రచారాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి

Nellore: నెల్లూరు జిల్లాలో విచ్చలవిడిగా ర్యాంకులు, మార్కుల ప్రచారాలు చేసుకుంటున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని PAAP జిల్లా కలెక్టర్‌ను డిమాండ్ చేసింది.

V. Narasimhulu, Nellore
Published on: 18 May 2026 6:28 PM IST
Nellore
X

Nellore: ర్యాంకుల విచ్చలవిడి ప్రచారాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి

Nellore: ర్యాంకులు, మార్కుల విచ్చలవిడి ప్రకటనలపై ,హౌర్డింగ్ ఏర్పాటు ఇంటింటా ప్రచారం నిర్వహణ పై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు PAAP విజ్ఞప్తి చేసింది. నూతన ప్రభుత్వ నిబంధన (G.O.Ms.No.9) ప్రకారం జూనియర్ కళాశాలలు, పాఠశాలల ర్యాంకులు, మార్కుల ప్రచారం చట్టవిరుద్ధం అని పేర్కొంది.

-పబ్లిక్ నోటీస్ బోర్డులపై, వెబ్‌సైట్లలో, హోర్డింగులను తొలగించాలని డిమాండ్ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే మొదటిసారి ₹50,000, రెండోసారి లక్ష రూపాయల జరిమానాతో పాటు రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని కోరింది. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ, పీర్ ప్రెషర్ (సహచరుల ఒత్తిడి), పబ్లిక్ షేమింగ్‌కు కారణమవుతున్న కార్పొరేట్ విద్యాసంస్థల మార్కులు, ర్యాంకుల విచ్చలవిడి ప్రచారాలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (PAAP) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం నెల్లూరు జిల్లా కలెక్టర్‌కు అసోసియేషన్ ప్రతినిధులు ఒక సమగ్ర విజ్ఞాపన పత్రాన్ని (Representation) సమర్పించారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ..

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల మానసిక ఒత్తిడి, ఆత్మహత్యలను అరికట్టడం కోసం "ఆంధ్రప్రదేశ్ కోచింగ్ సంస్థల (నియంత్రణ మరియు నియామక) నియమాలు, 2026" (G.O.Ms.No.9, Higher Education Dept., Dt:27-03-2026) జీవోను విడుదల చేసిందని గుర్తు చేశారు.

ఈ నిబంధనల్లోని రూల్ 11 (Confidentiality of Assessment Results) ప్రకారం ఏ కోచింగ్ సంస్థ లేదా జూనియర్ కళాశాల, పాఠశాల విద్యార్థుల మార్కులను, ర్యాంకులను గానీ, వారి పేర్లను గానీ పబ్లిక్ నోటీస్ బోర్డులపై, వెబ్‌సైట్లలో, హోర్డింగులలో ప్రదర్శించకూడదని స్పష్టమైన చట్టం ఉందన్నారు. ఫలితాలను కేవలం విద్యార్థికి, వారి తల్లిదండ్రులకు మాత్రమే ప్రైవేట్‌గా తెలియజేయాలని జీవో చెబుతోందని వివరించారు.

అయినప్పటికీ, ప్రస్తుతం పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల అనంతరం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అనేక పాఠశాలలు, జూనియర్ కళాశాలలు ఈ నిబంధనలను బేఖాతరు చేస్తూ భారీ హోర్డింగులు, పత్రికల్లో పూర్తి పేజీ ప్రకటనలు, సోషల్ మీడియా మరియు టీవీ ఛానళ్ల ద్వారా "మాకే టాప్ ర్యాంకులు" అంటూ విచ్చలవిడిగా ప్రచారం చేసుకుంటున్నాయని మండిపడ్డారు. ఇది జీవో లోని రూల్ 2(11) ప్రకారం "పబ్లిక్ షేమింగ్" (Public Shaming) కిందకు వస్తుందని, దీనివల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కలెక్టర్‌కు సమర్పించిన ప్రధాన డిమాండ్లు..

స్వయంప్రేరిత విచారణ (Suo Moto Inquiry): జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘించి ప్రకటనలు హౌర్డింగ్ ఏర్పాటు ,కరపత్ర ,పోస్టర్ల ప్రచారం ఇస్తున్న విద్యాసంస్థలపై కలెక్టర్ స్వయంగా విచారణ జరిపి, తనిఖీలకు ఆదేశించాలి.

రూల్ 18 ప్రకారం మొదటి ఉల్లంఘనకు ₹50,000, రెండో ఉల్లంఘనకు ₹1,00,000 జరిమానా విధించడంతో పాటు, తదుపరి ఉల్లంఘనలకు సదరు విద్యాసంస్థల గుర్తింపు/రిజిస్ట్రేషన్ రద్దు చేయాలి.

జిల్లాలోని అన్ని స్కూళ్లు, జూనియర్ కళాశాలలకు తక్షణం నోటీసులు జారీ చేసి, హోర్డింగులు, కరపత్రాల ద్వారా ర్యాంకుల ప్రచారం చేయకుండా కఠిన హెచ్చరికలు జారీ చేయాలి.

ఈ అంశాలపై జిల్లా యంత్రాంగం 15 రోజుల్లోపు చర్యలు తీసుకొని, తాము సమర్పించిన ఆధారాలపై తీసుకున్న చర్యల నివేదికను PAAP అసోసియేషన్‌కు అందజేయాలని కోరారు.

ఈ విషయమై ఉన్నత విద్యాశాఖ సెక్రటరీకి, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లకు కూడా ఫిర్యాదు ప్రతులను పంపినట్లు ప్రతినిధులు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు, ప్రాణాలతో ముడిపడి ఉన్న ఈ అంశంపై జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన స్పందించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో PAAP రాష్ట్ర అధ్యక్షులు నరహరి శిఖరం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉడుత రాజశేఖర్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ మునాఫ్, బూదురు కృష్ణమోహన్ మరియు విద్యార్థి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story