Udayagiri: ఉదయగిరి వేదికగా ‘పల్లె పండుగ 3.0’ ప్రారంభం!

Udayagiri: ఉదయగిరి రామాపురంలో ‘పల్లె పండుగ 3.0’కు శ్రీకారం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూ.11,085 కోట్ల గ్రామీణాభివృద్ధి పనుల ప్రారంభం కూటమి నేతల సమక్షం.

VENKATA PRASAD, UDAYAGIRI
Published on: 29 Sept 2026 11:31 PM IST
Udayagiri
X

Udayagiri: ఉదయగిరి వేదికగా ‘పల్లె పండుగ 3.0’ ప్రారంభం!

ఉదయగిరి: నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురం వేదికగా పల్లె పండుగ–3.0 కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని రాష్ట్రవ్యాప్తంగా రూ.11,085 కోట్లతో చేపట్టనున్న గ్రామీణ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, మౌలిక వసతులు, తాగునీరు, పశుసంవర్ధక రంగం, ఉద్యాన పంటలు, డ్రైనేజీ వంటి రంగాల్లో అభివృద్ధి పనులను పల్లె పండుగ–3.0లో భాగంగా చేపట్టనున్నారు. మొత్తం 6 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 9,500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 22 వేల మినీ గోకులాలు, 50 వేల ఎకరాల్లో ఉద్యాన పంటల అభివృద్ధి వంటి పనులు ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నాయి.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గ్రామీణాభివృద్ధి, సంక్షేమం, రహదారుల నిర్మాణం, రాష్ట్ర అభివృద్ధి అంశాలను ప్రస్తావించారు. ఉదయగిరి ప్రాంతానికి సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ప్రయోజనం కల్పించే అంశంలోనూ మాట్లాడారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పల్లెల అభివృద్ధే రాష్ట్ర ప్రగతికి పునాది అని పేర్కొంటూ.. పల్లె పండుగ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మౌలిక వసతుల అభివృద్ధి చేపడుతున్నట్లు వివరించారు. గత రెండేళ్లలో చేపట్టిన సీసీ రోడ్లు, మినీ గోకులాలు, గ్రామీణ రహదారులు, నీటి వసతులు వంటి అభివృద్ధి పనులను ప్రస్తావించారు.

కార్యక్రమంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కూడా పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చేపడుతున్న గ్రామీణ అభివృద్ధి కార్యక్రమానికి ఆయన హాజరై కూటమి భాగస్వామ్యాన్ని చాటారు.

ఇక ఉదయగిరి నియోజకవర్గానికి స్థానిక ఎమ్మెల్యేగా కాకర్ల సురేష్‌కు ఈ కార్యక్రమం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పల్లె పండుగ–3.0 ప్రారంభానికి ఉదయగిరి వేదిక కావడంతో పాటు.. నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి పనులను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ఉదయగిరి నియోజకవర్గంలో పల్లె పండుగ ద్వారా రూ.121 కోట్లతో 115 కిలోమీటర్ల మేర సీసీ, బీటీ రోడ్లు, 1,200కు పైగా నీటి కుంటలు, 348 మినీ గోకులాలు, 190కి పైగా నీటి తొట్లు, సుమారు 900 ఎకరాల్లో ఉద్యాన పంటల అభివృద్ధి పనులు చేపట్టినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.

అలాగే నియోజకవర్గంలోని ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం చూపేందుకు సుజల శ్రవంతి పథకం కింద రూ.52 కోట్లతో 381 పనులు చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఉదయగిరి కోటకు వెళ్లే మార్గంలో సుమారు 4 కిలోమీటర్ల రహదారికి రూ.2.5 కోట్లు మంజూరు చేయడంతో పాటు ఉదయగిరి కోట, కొండ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే అంశాలను కూడా ప్రస్తావించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఒకే వేదికపై పాల్గొన్న ఈ కార్యక్రమంతో ఉదయగిరి నియోజకవర్గం రాష్ట్రవ్యాప్త గ్రామీణ అభివృద్ధి కార్యక్రమానికి వేదికగా నిలిచింది. పల్లె పండుగ 3.0 ద్వారా ప్రారంభమైన పనులతో రాబోయే రోజుల్లో గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి మరింత ఊపు రానుంది.

VENKATA PRASAD, UDAYAGIRI

VENKATA PRASAD, UDAYAGIRI