Saidapuram: ప్రజల ముంగిటకే పాలన.. కొమ్మిపాడులో 'పల్లె వీక్షణ' సందడి!
Saidapuram: సైదాపురం మండలం కొమ్మిపాడులో పల్లె వీక్షణ కార్యక్రమం. కలెక్టర్ హిమాన్షు శుక్ల, ఎమ్మెల్యే రామకృష్ణ పర్యటన.
Saidapuram: ప్రజల ముంగిటకే పాలన.. కొమ్మిపాడులో 'పల్లె వీక్షణ' సందడి!
Saidapuram: వారంలో ఒకరోజు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఒక గ్రామానికి వచ్చి, ఆ గ్రామస్తుల సమస్యలను నేరుగా పరిశీలించి సత్వర పరిష్కారం చూపడమే లక్ష్యంగా జిల్లాలో “పల్లె వీక్షణ” కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు.
శుక్రవారం సైదాపురం మండలం కొమ్మిపాడు గ్రామంలో వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణతో కలిసి కలెక్టర్ పల్లె వీక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
తొలుత ఎమ్మెల్యేతో కలిసి కలెక్టర్ గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. ఉపాధి హామీ పనులను ప్రత్యక్షంగా పరిశీలించి పనుల నాణ్యతపై అధికారులకు సూచనలు చేశారు. సమీపంలో ఉన్న చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో మమేకమై వారి అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు.
రైతు సేవా కేంద్రంలో నిమ్మ రైతులతో కలెక్టర్ మమేకమయ్యారు. నిమ్మ సాగు విధానం, మార్కెటింగ్, లాభాలపై ఆరా తీశారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సుబ్బారెడ్డి గ్రామంలో నిమ్మ, మామిడి సాగు వివరాలను కలెక్టర్‌కు వివరించారు. గత ఏడాది ప్రయోగాత్మకంగా చేపట్టిన సాంకేతిక విజ్ఞానంతో నిమ్మ సాగులో మెరుగైన ఫలితాలు వచ్చాయని, ఇదే విధానాన్ని రైతులందరూ అవలంబించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం పీఎండీఎస్ విత్తనాలను ఎమ్మెల్యే, కలెక్టర్ రైతులకు పంపిణీ చేశారు.
విలేజ్ హెల్త్ క్లినిక్‌ను కలెక్టర్, ఎమ్మెల్యే పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. గ్రామ ప్రజలందరికీ ఆరోగ్య భద్రత కల్పించేలా వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.
"గ్రామస్తులతో ముఖాముఖి.. అర్జీల స్వీకరణ"
అనంతరం జిల్లాస్థాయి అధికారులతో కలిసి కలెక్టర్, ఎమ్మెల్యే గ్రామస్తులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి పలు అర్జీలు స్వీకరించారు. అందిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గ్రామస్తులు తెలిపిన ప్రతి సమస్యను క్షుణ్ణంగా ఆలకించిన కలెక్టర్, ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మీడియాతో మాట్లాడుతూ..
ప్రతి గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నూటికి నూరు శాతం సమర్థవంతంగా అమలు చేస్తూ అర్హులందరికీ అందేలా పర్యవేక్షించడమే “పల్లె వీక్షణ” కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజల సంతృప్తి స్థాయిని స్వయంగా తెలుసుకుని, ఎక్కడైనా లోపాలు ఉంటే చక్కదిద్దేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు.
ఈ గ్రామంలో రైతులు ప్రధానంగా నిమ్మ పంటపై ఆధారపడి ఉన్నారని, ఇది వర్షాధార గ్రామమని తెలిపారు. జలధార కార్యక్రమం ద్వారా గ్రామంలో జలవనరుల అభివృద్ధికి అనేక పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. గ్రామ పర్యటనలో అంగన్వాడీ కేంద్రం వద్ద సిమెంట్ రోడ్డు నిర్మాణం, ఓహెచ్ఆర్ ట్యాంక్ నుంచి పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు.ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణ పైప్‌లైన్ నిర్మాణానికి అవసరమైన రూ.2.60 లక్షలను తక్షణమే మంజూరు చేశారని, సిమెంట్ రోడ్డు నిర్మాణానికీ ఆమోదం తెలిపినట్లు కలెక్టర్ వెల్లడించారు. గ్రామంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి విద్యుత్ శాఖ అధికారులు చర్యలు ప్రారంభించారని చెప్పారు.
గ్రామంలో సుమారు 80కి పైగా అర్జీలు అందాయని, కొన్ని సమస్యలకు వెంటనే పరిష్కారం చూపించామని, మరికొన్నింటికి నెలరోజుల్లో పరిష్కార మార్గం చూపిస్తామని కలెక్టర్ తెలిపారు. ఒక గ్రామానికి సుమారు 30 శాఖల అధికార యంత్రాంగం నేరుగా వచ్చి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వివరించారు.
"రెండు సంవత్సరాల్లో రూ.136 కోట్ల అభివృద్ధి పనులు : ఎమ్మెల్యే రామకృష్ణ"
వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ...
గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజల వద్దకే అధికారులు వచ్చి సమస్యలు పరిష్కరించే సరికొత్త కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. గత పరిపాలనకు, ప్రస్తుతం జరుగుతున్న పరిపాలనకు తేడాను ప్రజలు గమనించాలని సూచించారు.
సైదాపురం మండలంలో గత రెండేళ్లలో రూ.136 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టామని, కొమ్మిపాడు గ్రామంలోనే రూ.3.42 కోట్ల అభివృద్ధి పనులు నిర్వహించినట్లు తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి అండగా నిలిచామని, మండలంలో ఇప్పటివరకు రూ.1.10 కోట్ల చెక్కులు అందించినట్లు వెల్లడించారు.
జిల్లా కలెక్టర్ వినూత్న ఆలోచనతో పల్లె వీక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రశంసించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై గ్రామస్తులకు విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
అనంతరం సైదాపురం మండలంలో పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎమ్మెల్యే, కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. పలువురు బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అనూష, డీపీఓ వసుమతి, డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి, ఐసీడీఎస్ పీడీ హేనా సుజన్, జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సుబ్బారెడ్డి, డీఎం అండ్ హెచ్‌వో సుజాత, విద్యుత్ శాఖ ఎస్‌ఈ రాఘవేంద్రన్, డీసీవో గుర్రప్ప, ఏపీఎంఐపీ పీడీ పద్మలత, ఎంపీడీవో రామ్మోహన్ రెడ్డి, తహసీల్దార్ సుభద్ర, వివిధ శాఖల అధికారులు, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.




