Nellore: పెంచలకోనలో శాస్త్రోక్తంగా శ్రీవారి చక్రస్నానం
Nellore: నెల్లూరు జిల్లా పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి.
Nellore: పెంచలకోనలో శాస్త్రోక్తంగా శ్రీవారి చక్రస్నానం
Nellore: నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోనలో శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు ఉదయం శ్రీవారి చక్రస్నాన ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా స్వామి, అమ్మవార్లతోపాటు చక్రతాళ్వార్ ను పల్లకిలో కొలువుదీర్చారు. మంగళవాయిద్యా లతో ఊరేగింపుగా శ్రీవారి నందన వనంలోని పుష్పరిణి వద్ద మండపంలోకి వేంచేపు చేశారు.
విష్వక్నేనారాధన, పణ్యహవచనం, నవకలశ స్నపన తిరుమంజనం నిర్వహించారు. పసుపు,కుంకుమ, చందనం, సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకాలు జరిపించారు. అనంతరం వేదపండితులు మంత్రోచ్చరణల నడుము పుష్కరిణిలో చక్రతాళ్వార్ కు స్నానం చేయించారు.ఈ సందర్భంగా పెద్దసంఖ్యలో భక్తులు పవిత్ర పుష్కరిణిలో స్నానమాచరించి తన్మయత్వం చెందారు.మూడుసార్లు చక్ర స్నానం చేయించారు.
"వైభవంగా వసంతోత్సవం"
స్వామి వారి అలంకార మండవంలో ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేతంగా పెంచల స్వామివారిని కొలువుదీర్చారు. అనంతరం వేడుకగా వసంతోత్సవం నిర్వహించారు. దేవదేవేరులకు ప్రత్యేక పూజలు చేపట్టి విశేష అభిషేకాలు జరిపించారు. శ్రీవారి ఆలయం వద్ద ఆలయ అధికారులు, అర్చకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు వసంతాలు చల్లుకుని డప్పులు వాయిస్తూ, చిందులు వేస్తూ, నందనవనంలోని స్వామివారి అభిషేకాలు వేదిక వద్దకు చేరుకున్నారు.
కార్యక్రమాల్లో ఆలయ డిప్యూటీ కమిషనర్ కోవూరు జనార్దన్ రెడ్డి, ఆలయ ఉత్సవ కమిటీ ఛైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి, సభ్యులు పీర్ల సోమయ్య యాదవ్, హాజరత్ నాయుడు, ఆలయ ప్రధాన అర్చకులు పెంచలయ్య స్వామి, రామయ్య స్వామి, టీటీడీ పాంచరాత్ర ఆగమపండితులు రామానుజాచార్యులు, శశి స్వామి, నాగరాజ స్వామి, వినోద్ స్వామి, మలికార్జున స్వామి, బాలాజీ స్వామి, మోక్షజ్న స్వామి, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.




