Nellore: పొదలకూరులో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్: 27 వాహనాలు సీజ్!
Nellore: పొదలకూరు ఎంఆర్ఓ కాలనీలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 27 బైక్లు సీజ్ చేసి, రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
Nellore: పొదలకూరులో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్: 27 వాహనాలు సీజ్!
నెల్లూరు: SPSR నెల్లూరు జిల్లాలో నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడి, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై నిఘా పెంపు, ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు (CASO) నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు పొదలకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో విస్తృత కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.ఈ తనిఖీల్లో పొదలకూరు సబ్ ఇన్స్పెక్టర్తో పాటు 12 మంది పోలీసు సిబ్బంది పాల్గొని సంబంధిత ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా పొదలకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో MRO కాలనీ నందు సుమారు 120 ఇళ్లను తనిఖీ చేసి, సరైన ఆధార పత్రాలు లేని 27 ద్విచక్ర వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఆపరేషన్లో భాగంగా గత కేసులతో సంబంధం ఉన్న ముగ్గురు రౌడీషీటర్లు, ముగ్గురు అనుమానితులను గుర్తించి పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఆపరేషన్ త్రిశూల్లో భాగంగా నేరాల నివారణ, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, మహిళల భద్రత, రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనల పాటింపు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
జిల్లాలో నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడి, ప్రజల భద్రతను మరింత పటిష్టం చేయడంలో భాగంగా ఇటువంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని జిల్లా పోలీసు శాఖ స్పష్టం చేసింది.




