Nellore: 92 మందికి తోపుడు బండ్లు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
Nellore: నెల్లూరులో 92 మందికి తోపుడు బండ్లు, 12 మందికి ట్రైసైకిళ్లు, 40 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు షరణి.
Nellore: 92 మందికి తోపుడు బండ్లు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
నెల్లూరు: పేదరికం కష్టాలను స్వయంగా అనుభవించిన తన తండ్రి మంత్రి నారాయణ పేదల పక్షాన నిలిచే నాయకుడిగా ముందుకు సాగుతున్నారని ఆయన కుమార్తె పొంగూరు షరణి అన్నారు. సిటీ నియోజకవర్గంలోని వీధి వ్యాపారులు, వికలాంగులు, అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు అండగా నిలుస్తూ తమ కుటుంబం సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోందన్నారు.
గోమతి నగర్‌లోని క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో 92 మంది పేద వీధి వ్యాపారులకు తోపుడు బండ్లు, 12 మంది వికలాంగులకు ట్రైసైకిళ్లు, 40 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పొంగూరు షరణి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మంత్రి నారాయణ కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా షరణి మాట్లాడుతూ తన తండ్రి నారాయణ నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగారని, పేదల కష్టాలను స్వయంగా అనుభవించారని చెప్పారు.
ఎన్నికల ప్రచార సమయంలో వీధి వ్యాపారుల సమస్యలను దగ్గరగా చూశారని, తోపుడు బండ్లకు అద్దె చెల్లించలేక వారు పడుతున్న ఇబ్బందులను గుర్తించారని తెలిపారు.అధికారంలోకి వచ్చిన వెంటనే పేద వీధి వ్యాపారులకు ఉచితంగా తోపుడు బండ్లు అందిస్తానని నాన్న మాట ఇచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ విడతల వారీగా ఇప్పటివరకు 865 తోపుడు బండ్లను పంపిణీ చేశామని తెలిపారు.
వికలాంగులకు ఇప్పటివరకు 25 ట్రైసైకిళ్లను అందించామని, పేదల వైద్య ఖర్చులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా అండగా నిలుస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 529 మందికి రూ.4.88 కోట్ల సీఎంఆర్ఎఫ్ సాయం అందించామని వెల్లడించారు.
సీఎంఆర్ఎఫ్ పేదల పాలిట సంజీవనిలా పనిచేస్తోందని షరణి అన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు సహాయం కోరినప్పుడు మానవతా దృక్పథంతో సీఎంఆర్ఎఫ్ మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు.
పేద పిల్లల చదువుపై ప్రత్యేక దృష్టి
పేద పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేలా యువనేత నారా లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా విద్యారంగంలో కూడా తన తండ్రి నారాయణ ప్రత్యేక దృష్టి పెట్టారని షరణి తెలిపారు.నెల్లూరులోని వీఆర్సీ స్కూల్ తరహాలో మరో 15 ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తున్నారని చెప్పారు.నిరుపేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందించాలన్నదే నాన్న లక్ష్యమన్నారు . పేద విద్యార్థుల కోసం ఒలింపియాడ్, ఐఐటీ ఫౌండేషన్ కోర్సులను కూడా ప్రారంభించారని తెలిపారు. ఆధునీకరించిన ఆర్ఎస్ఆర్, డిఎస్ఆర్ పాఠశాలలను ఈ నెల 16న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారని తెలిపారు.
తన తండ్రి చేపట్టిన విద్యాయజ్ఞంలో తాను కూడా భాగస్వామి కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నెల్లూరు నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని చెప్పారు.నమ్మిన ప్రతి ఒక్కరికీ తమ కుటుంబం అండగా నిలుస్తుందన్నారు. నాన్నగారికి అండగా నిలిచి అత్యధిక మెజారిటీ ఇచ్చిన సిటీ ప్రజల రుణాన్ని సేవా కార్యక్రమాల ద్వారా తీర్చుకుంటామని షరణి అన్నారు.
అభివృద్ధి,సంక్షేమం సమపాళ్లలో
డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ నెల్లూరు సిటీలో మంత్రి నారాయణ అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. రాజకీయ నాయకుడంటే ఎలా ఉండాలో చూపించేలా రోల్‌మోడల్‌గా నిలుస్తున్నారని కొనియాడారు.
పేదల పక్షపాతిగా ఆయన మన్ననలు పొందుతున్నారని, సొంత నిధులతో పాటు స్నేహితుల సహకారాన్ని కూడా సమీకరించి నగర రూపురేఖలు మార్చేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో అపార అనుభవమున్న కుమార్తె షరణిని కూడా ఈ విద్యాయజ్ఞంలో భాగస్వామిని చేయడం అభినందనీయమన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి తక్షణం స్పందించే కుటుంబంగా మంత్రి నారాయణ కుటుంబం నిలుస్తోందని అన్నారు.
ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు మామిడాల మధు, కార్పొరేటర్లు కర్తం ప్రతాప్‌రెడ్డి, కరీముల్లా, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, కార్పొరేటర్లు, డివిజన్ క్లస్టర్ ఇన్‌చార్జిలు, అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.




