Rapur: రాపూరు విద్యుత్ సబ్‌స్టేషన్‌లో సిబ్బంది గైర్హాజరు

Rapur: నెల్లూరు జిల్లా రాపూరు విద్యుత్ సబ్‌స్టేషన్‌లో సిబ్బంది గైర్హాజరుపై సామాన్యుడి ఆగ్రహం. సోషల్ మీడియాలో వీడియో వైరల్. అధికారుల విచారణకు డిమాండ్.

Yellayya, Nellore
Published on: 13 Aug 2026 6:06 PM IST
Rapur
X

Rapur: రాపూరు విద్యుత్ సబ్‌స్టేషన్‌లో సిబ్బంది గైర్హాజరు

రాపూరు: ప్రజలకు విద్యుత్ సేవలు అందించాల్సిన అధికారులు, సిబ్బంది విధులకు గైర్హాజరవుతున్నారంటూ ఓ సామాన్యుడు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన నెల్లూరు జిల్లా రాపూరులో వెలుగులోకి వచ్చింది. రాపూరు 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో మధ్యాహ్నం సమయంలో అధికారులు, సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యపై మాట్లాడేందుకు ఈరోజు మధ్యాహ్నం సుమారు 3.30 గంటల సమయంలో సబ్‌స్టేషన్ కార్యాలయానికి వెళ్లినట్లు ఆయన తెలిపారు. అయితే కార్యాలయంలోకి వెళ్లి చూడగా ఖాళీ కుర్చీలు మాత్రమే కనిపించాయని, ఒక్క అధికారి లేదా సిబ్బంది కూడా అందుబాటులో లేరని ఆరోపించారు. దీంతో కార్యాలయం, పరిసరాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ తన ఆవేదనను వ్యక్తం చేశారు.

ఆఫీసా.. లాడ్జా?

సబ్‌స్టేషన్‌లోని కొన్ని గదుల్లో ఫ్యాన్లు తిరుగుతుండటం, మంచాలు ఏర్పాటు చేసి ఉండటాన్ని ఆయన వీడియోలో చూపించారు. తాగునీటి సీసాలు, గ్లాసులు, ప్లేట్లు తదితర వస్తువులు ఉండటాన్ని ప్రస్తావిస్తూ కార్యాలయాన్ని సిబ్బంది విశ్రాంతి గదిలా ఉపయోగిస్తున్నారంటూ విమర్శించారు.

కరెంట్ కోతలపై ఆగ్రహం

ఉదయం నుంచి తరచూ విద్యుత్ కోతలు విధిస్తున్నారని, కరెంట్ ఎందుకు తీస్తున్నారో అడిగేందుకు అధికారులు అందుబాటులో లేకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. వినియోగదారుల నుంచి ప్రతి నెలా విద్యుత్ బిల్లులు మాత్రం క్రమం తప్పకుండా వసూలు చేస్తున్నారని, బిల్లు ఆలస్యమైతే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మల్లంగంట గ్రామంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన పేద ప్రజలు అధికంగా నివసిస్తున్నారని, వారు క్రమం తప్పకుండా విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నప్పటికీ సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజలు ప్రశ్నించినప్పుడే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, తమ గ్రామం తరఫున విద్యుత్ శాఖ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తానని స్పష్టం చేశారు.

విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్

రాపూరు సబ్‌స్టేషన్‌లో సిబ్బంది విధులకు గైర్హాజరవుతున్నారనే ఆరోపణలపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. సిబ్బంది విధుల్లో సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా, నాణ్యమైన సేవలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై అధికారులు స్పందించి వాస్తవాలను వెల్లడించాలని కోరుతున్నారు.

Yellayya, Nellore

Yellayya, Nellore

Next Story