Chintareddypalem: చింతారెడ్డిపాళెం వద్ద రూ.115.27 కోట్లతో అండర్‌పాస్!
Chintareddypalem: నెల్లూరు బైపాస్ చింతారెడ్డిపాళెం జంక్షన్ వద్ద రూ.115.27 కోట్లతో ఆరు లేన్ల అండర్‌పాస్, సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి, ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
Chintareddypalem: చింతారెడ్డిపాళెం వద్ద రూ.115.27 కోట్లతో అండర్‌పాస్!
Chintareddypalem: చింతారెడ్డిపాళెం క్రాస్‌రోడ్డులో ఏళ్ల తరబడి ప్రజలను భయపెడుతున్న ప్రమాదాల ముప్పునకు తెరపడనుంది. హైవే దాటాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితికి త్వరలోనే పరిష్కారం లభించనుంది. నెల్లూరు బైపాస్‌లోని చింతారెడ్డిపాళెం జంక్షన్ సమీపంలో రూ.115.27 కోట్లతో ఆరు లేన్ల అండర్‌పాస్, సర్వీస్ రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఏళ్ల నాటి సమస్యకు పరిష్కారం చూపే దిశగా పనులు ప్రారంభం కావడంతో పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కృతజ్ఞతలు తెలిపారు.
చింతారెడ్డిపాళెం క్రాస్‌రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారిందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. నాలుగు గ్రామాల ప్రజలతో పాటు ఆసుపత్రులకు వెళ్లే రోగులు, వారి కుటుంబ సభ్యులు ఈ మార్గంలో రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ క్రాస్‌రోడ్డు వద్ద జరిగిన ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయాలపాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి సమస్య పరిష్కారానికి కృషి చేశామని చెప్పారు.ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సహకారంతో అండర్‌పాస్ నిర్మాణానికి అవసరమైన అనుమతులు సాధించామని మంత్రి వెల్లడించారు. భూసేకరణ ప్రక్రియను సైతం పూర్తి చేసి పనులు ప్రారంభించేందుకు మార్గం సుగమం చేశామని తెలిపారు. EPC విధానంలో పీటీఆర్ బ్రదర్స్ ప్రాజెక్ట్స్ సంస్థ నిర్మాణ పనులు చేపట్టనుందని, పనులు ప్రారంభించిన తేదీ నుంచి 15 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు
అభివృద్ధి పనులను కూడా రాజకీయాలకు వాడుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోందని మంత్రి విమర్శించారు. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టిస్తూ, ఉనికిని కాపాడుకునేందుకు అడ్డగోలు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిని అడ్డుకునేందుకు కూడా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అభివృద్ధి విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
వ్యవస్థలను నిర్వీర్యం చేసిన గత పాలనకు, సుపరిపాలన అందించేందుకు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మాటలకే పరిమితమయ్యే పాలన ఏదో, పనులు చేసి చూపించే పాలన ఏదో ప్రజలకు అర్థమవుతోందని పేర్కొన్నారు. వైసీపీ తన వైఖరి మార్చుకోకపోతే ప్రజలే తగిన సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు.
వేల కుటుంబాలకు ఊరట
ఏళ్లనాటి సమస్య పరిష్కారానికి పునాది పడిన ఈ రోజు వేలాది కుటుంబాలకు ఊరట కలిగించే రోజని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి అన్నారు. మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి సమన్వయంతో వివిధ అవాంతరాలను అధిగమించి అండర్‌పాస్ మంజూరు చేయించారని పేర్కొన్నారు. నెల్లూరులో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు.
రానున్న ఎన్నికల్లో నెల్లూరు నగరంలోని 72 డివిజన్లలో కూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించి అభివృద్ధికి మద్దతు తెలపాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర మేయర్ దేవరకొండ సుజాత, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ తాళ్లపాక అనూరాధ, నగర టీడీపీ అధ్యక్షుడు మామిడాల మధు, జనసేన నేత గునుకుల కిషోర్, టీడీపీ నేతలు ఊటుకూరు చంద్ర, కాయల తిరుపతి, రాజా నాయుడు, తిరుమల నాయుడు, బాలాజీ, జహీర్, మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.




