Nellore: నెల్లూరులో ఘనంగా 'సేవా సంకల్ప్ అభయాన్' కార్యక్రమం!

Nellore: నగరంలోని చింతారెడ్డిపాలెం క్యాంపు కార్యాలయంలో మంత్రి పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో 'సేవా సంకల్ప్ అభయాన్' కార్యక్రమంలో భాగంగా దీపోత్సవం నిర్వహించారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 18 Sept 2026 12:52 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో ఘనంగా 'సేవా సంకల్ప్ అభయాన్' కార్యక్రమం!: నెల్లూరులో ఘనంగా 'సేవా సంకల్ప్ అభయాన్' కార్యక్రమం!

Nellore: కేంద్ర ప్రభుత్వ పిలుపుతో సెప్టెంబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 17 వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభయాన్ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని చింతారెడ్డిపాలెంలో ఉన్న మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆశీర్వాద్ కా దియా కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ నేతలతో కలిసి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ పొంగూరు నారాయణ కొవ్వొత్తులు వెలిగించి సేవాసంకల్ప్ అభయాన్ కి మద్దతు తెలిపారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు దీపాలు వెలిగించి సేవా సంకల్ప్ అభయాన్‌కు మద్దతు తెలపడం సంతోషంగా ఉందన్నారు. అర్హుడైన ప్రతి పేదవాడి ఇంటికి ప్రభుత్వ పథకం చేరినప్పుడే దాని అసలైన ప్రయోజనం నెరవేరుతుందని చెప్పారు.

సేవా సంకల్ప్ అభయాన్ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించి, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. సేవ, సంక్షేమం, ప్రజాభాగస్వామ్యంతో పాటు 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ప్రతి కుటుంబం అభివృద్ధి చెందితేనే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని మంత్రి అన్నారు. లబ్ధిదారుల ఇళ్లలో వెలిగిన సేవా సంకల్ప్ అభయాన్ దీపం నుంచి ప్రతి ఇంట్లో అభివృద్ధి వెలుగు రావాలన్న సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు.వికసిత్ భారత్ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని సూచించారు.

మహిళలు, విద్యార్థులు, రైతులు, వ్యాపారులు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు దేశ నిర్మాణంలో తమ వంతు భాగస్వామ్యం అందించాలని కోరారు. నెల్లూరు సిటీ నుంచి వికసిత్ భారత్ నిర్మాణంలో తమ వంతు భాగస్వామ్యాన్ని చాటుతామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్,టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE