Atmakur: సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ముందు దస్తావేజు లేఖరుల భారీ ధర్నా!
Atmakur: జీవో ఎంఎస్ నెం.396 కు వ్యతిరేకంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట దస్తావేజు లేఖరులు నిరసన చేపట్టారు.
Atmakur: సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ముందు దస్తావేజు లేఖరుల భారీ ధర్నా!
ఆత్మకూరు: రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో తీసుకొచ్చిన జీవో ఎంఎస్ నెం.396 కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా దస్తావేజు లేఖరులు చేపట్టిన పెన్‌డౌన్ ఉద్యమం రెండో రోజూ కొనసాగింది. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట దస్తావేజు లేఖరులు, లేఖరి సహాయకులు, డీటీపీ ఆపరేటర్లు, స్టాంపు వెండర్లు ధర్నా నిర్వహించి ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ శాఖలో ప్రజా–ప్రైవేట్ భాగస్వామ్య (PPP) విధానాన్నిప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దస్తావేజుల తయారీని రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలకు అప్పగించడం వల్ల వేలాది మంది దస్తావేజు లేఖర్లు, సహాయకులు, డీటీపీ ఆపరేటర్లు, స్టాంపు వెండర్ల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న దస్తావేజు లేఖర్లకే అవకాశం కల్పించి వారి జీవనోపాధిని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ఎంఎస్ నెం.396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.అలాగే రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల ప్రజల వ్యక్తిగత, ఆస్తి సంబంధిత సమాచారం గోప్యతకు భంగం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో సమర్థవంతంగా కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటీకరించడం సమంజసం కాదన్నారు.
ఈ నెల 20 నుంచి 31వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక పెన్‌డౌన్ కొనసాగుతుందని, ప్రభుత్వం జీవో నెం.396ను ఉపసంహరించుకునే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖర్లు జి.వి. కోటేశ్వరరావు, సయ్యద్ ఖాజా రంతుల్లా, జి. సాయి హరీష్ నాయుడు, కోడూరు పెంచలయ్య, మీసాల గణేష్, వి. వెంకటేశ్వర్లు, ఎం. రమేష్, స్టాంపు వెండర్లు కోటకొండ హరికిరణ్, పుష్పలత హరీష్, అలువాల సుబ్రహ్మణ్యం, అలువాల సుజాత, మద్దిలేటి, దావా దైవకృప, రాచాల దొరసానమ్మ, డీటీపీ ఆపరేటర్లు మరియు ఇతరులు పాల్గొన్నారు.




