Sullurupeta: పారిశుధ్య కార్మికుల భద్రతే ధ్యేయం: ఎమ్మెల్యే విజయశ్రీ

Sullurupeta: సూళ్లూరుపేటలో పారిశుధ్య కార్మికులకు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ రేడియం జాకెట్లు పంపిణీ చేశారు. పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దుతామన్నారు.

KKV Sudhakar, Sullurupeta
Published on: 7 Aug 2026 3:11 PM IST
Sullurupeta
X

Sullurupeta: పారిశుధ్య కార్మికుల భద్రతే ధ్యేయం: ఎమ్మెల్యే విజయశ్రీ

​సూళ్ళూరుపేట:

పట్టణ పరిశుభ్రత కోసం రేపంబవళ్లు శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికుల ఆరోగా్యంతో పాటు వారి భద్రతే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని సూళ్ళూరుపేట శాసనసభ్యురాలు శ్రీమతి డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. స్థానిక సూళ్ళూరుపేట పురపాలక సంఘం కార్యాలయ ప్రాంగణంలో పారిశుధ్య కార్మికులకు రేడియం జాకెట్లు పంపిణీ చేసే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ కార్మికులకు సొంత చేతుల మీదుగా రేడియం జాకెట్లను అందజేశారు.

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా.నెలవల విజయశ్రీ మాట్లాడుతూ.. విధులు నిర్వహించే సమయంలో ప్రతి ఒక్క పారిశుధ్య కార్మికుడు తప్పనిసరిగా రేడియం జాకెట్లు ధరించాలని సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో, తెల్లవారుజామున చీకటిగా ఉండే సమయాల్లో వీధులను శుభ్రం చేసేటప్పుడు వేగంగా వచ్చే వాహనాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. రేడియం జాకెట్లు ధరించడం ద్వారా దూరంగా వస్తున్న వాహనదారులకు కార్మికులు స్పష్టంగా కనిపిస్తారని, దీనివల్ల రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూసుకోవడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని వివరించారు.

​అనంతరం మున్సిపల్ కమిషనర్ కె. చిన్నయ్య మాట్లాడుతూ సూళ్ళూరుపేట పట్టణాన్ని సుందరంగా, ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు మున్సిపాల్టీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. పట్టణంలోని ప్రముఖ వ్యాపార, వాణిజ్య ప్రాంతాలలో ప్రత్యేకంగా సీసా ఆకారంలో ఉన్న చెత్త డబ్బాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రజలు తాము వాడిపడేసిన ప్లాస్టిక్ బాటిళ్లను చెల్లాచెదురుగా వేయకుండా, ఈ సీసా ఆకారపు డబ్బాల్లోనే వేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంటింటా సేకరించే చెత్తను రోడ్లపై, మురుగు కాలువల్లో పడేయకుండా నేరుగా మున్సిపల్ సిబ్బందికే అందజేయాలన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించాలని కోరారు.

​ఈ కార్యక్రమంలో ఏఎమ్‌సి (AMC) చైర్మన్ శ్రీ ఆకుతోట రమేష్, సొసైటీ చైర్మన్ ఏ.జి. కిశోర్, కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta

Next Story