Nellore: స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్తాం

Nellore: స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు దక్కకుండా వైకాపా నేతలు కుట్ర పన్నారని, న్యాయపోరాటం చేసి బీసీలకు న్యాయం చేస్తామని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తెలిపారు.

V. Narasimhulu, Nellore
Published on: 2 Oct 2026 9:58 PM IST
Nellore
X

Nellore: స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్తాం

నెల్లూరు: స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించాలన్న మా సంకల్పం మారదు అని అన్నారు టిడిపి జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర. బీసీలకు రిజర్వేషన్, పదవులు రాకూడదన్న కుట్రతో వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లి నిస్సిగ్గుగా అడ్డుకున్నారని, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం, న్యాయపరంగా ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించి బీసీలకు న్యాయం జరిగేలా చూస్తామని ఆయన అన్నారు.

బీసీలకు 34% రిజర్వేషన్ ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని జీవో నెం. 105, 1065 జారీ చేస్తే వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారని, ఎన్నికలు జరగకూడదు, బీసీలకు రిజర్వేషన్ దక్కకూడదనే కుట్రతో గొడ్డలి పార్టీ నేతలు అడ్డుకున్నారని చెప్పారు.. వైసీపీ హయాంలో 34% రిజర్వేషన్లను కోర్టు కొట్టివేస్తే సుప్రీంకోర్టుకు వెళ్లకుండా బీసీలకు చారిత్రాత్మక ద్రోహం చేశారని తెలిపారు.

బీసీలకు 34% రిజర్వేషన్లు ఇస్తే రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుతుందనే కుట్రతో గొడ్డలి పార్టీ నేతలు న్యాయస్థానంలో పిటిషన్లు వేసి బీసీలకు తీరని ద్రోహం చేశారని, వైసీపీ హయాంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 34% ఇవ్వకపోవడం వల్ల 16,800 మంది పదవులు కోల్పోయారని చెప్పారు. అన్ని వర్గాల హక్కులను కాపాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్లను బీసీలకు పునరుద్దరించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు.

బీసీలకు అవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా చేయాలనే అజెండాతో గొడ్డలి పార్టీ నేతలు పనిచేస్తున్నారని చెప్పారు... వెనుకబడిన వర్గాలను ఓటు బ్యాంకులా చూడాలనే కుట్రతో గొడ్డలి పార్టీ నేతలు ఇటువంటి నీచ రాజకీయాలు చేస్తున్నారని, బీసీలను రాజ్యాధికారంలో భాగస్వాములు చేసేందుకు తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తూ బీసీలకు న్యాయం జరిగేలా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని, ఇది కేవలం రిజర్వేషన్ల అంశం మాత్రమే కాదు.. బీసీలకు దక్కాల్సిన రాజకీయ ప్రాతినిధ్యం అని,నాలుగు దశాబ్దాల క్రితమే బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించి 1987లో 20%, 1995లో 34% రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు.

వైసీపీ నేతల కుట్రలను బీసీలు, ప్రజలు గమనిస్తున్నారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore