Nellore: రిటైర్డ్ ఉపాధ్యాయుడి కుటుంబం బలవన్మరణం

Nellore: నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 15 Jun 2026 2:30 PM IST
Nellore
X

Nellore: రిటైర్డ్ ఉపాధ్యాయుడి కుటుంబం బలవన్మరణం

Nellore: నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు మధుసూదన్‌రావు, ఆయన భార్య రత్నావళి, కుమారుడు సాయి సుకృత్ తమ నివాసంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న సంగం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్థానికుల వివరాల ప్రకారం మధుసూదన్‌రావు కొడవలూరు మండలం కొత్తవంగల్లులో ఉపాధ్యాయుడిగా పనిచేసి మూడేళ్ల క్రితం పదవీ విరమణ పొందారు. ఆయన కుమారుడు సాయి సుకృత్ బీటెక్ పూర్తి చేసి తిరుపతిలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది.

కుటుంబ సభ్యులు కుమారుడి తో పాటుఎక్కువగా తిరుపతిలోనే నివసిస్తూ, అప్పుడప్పుడు దువ్వూరుకు వచ్చేవారని గ్రామస్తులు తెలిపారు.ఈ మధ్య గ్రామానికి వచ్చిన కుటుంబం అర్ధరాత్రి సమయంలో ఇంటి బయట గేటుకు తాళం వేసి, తాళాన్ని అక్కడే ఉంచి, ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ముగ్గురూ చేతులు, కాళ్లు కట్టుకుని ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

ఘటనా స్థలంలో లభ్యమైన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు తమ ఆత్మహత్యకు గల కారణాలను అందులో వివరించినట్లు సంగం సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. శారీరక, మానసిక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, భవిష్యత్తుపై ఆశలు కోల్పోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారని వెల్లడించారు.

అదే లేఖలో తమ ఆస్తులకు సంబంధించిన వీలునామాను కూడా రాసి ఉంచినట్లు పోలీసులు తెలిపారు. బంగారం, ఇల్లు, స్థలాలను కుటుంబ సభ్యులకు కేటాయించడంతో పాటు, ఒక ప్లాట్‌ను నెల్లూరు రెడ్‌క్రాస్ సంస్థకు ఇవ్వాలని పేర్కొన్నట్లు వెల్లడించారు. మరణానంతరం కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా ఆలోచించి,

రెడ్‌క్రాస్‌కు స్థలం కేటాయించడం మధుసూదన్‌రావు సేవాభావానికి నిదర్శనమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఆ వీలునామాపై ముగ్గురు కుటుంబ సభ్యుల సంతకాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. పోస్టుమార్టం నివేదికతో పాటు పూర్తి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story