Nellore: నర్రవాడ శ్రీ వేంగమాంబ అమ్మవారి సన్నిధిలో ఘనంగా వరుణ యాగం!
Nellore: సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతూ నెల్లూరు జిల్లా నర్రవాడలో వరుణ యాగం. పాల్గొన్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్.
Nellore: నర్రవాడ శ్రీ వేంగమాంబ అమ్మవారి సన్నిధిలో ఘనంగా వరుణ యాగం!
Nellore: నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నర్రవాడ శ్రీ వేంగమాంబ పేరంటాలు అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో మంగళవారం వరుణ యాగాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వరుణ యాగంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రకృతి అనుకూలంగా ఉండి సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, పాడిపంటలు కళకళలాడాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ వేద పండితుల ఆధ్వర్యంలో వరుణ యాగాన్ని నిర్వహించారు. ప్రజల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, ఉదయగిరి నియోజకవర్గ సర్వతోముఖ అభివృద్ధి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. అనంతరం ఉదయగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి జలవనరులు నిండాలని, రైతాంగానికి మేలు జరగాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, వేద పండితులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




