Atmakur: బాలికల హాస్టల్‌లో డెంగ్యూ అలర్ట్.. వైద్యాధికారి తనిఖీలు!

Atmakur: ఆత్మకూరులో అరుంధతివాడ వైద్యాధికారి డాక్టర్ సాయి ప్రసన్న బీసీ బాలికల హాస్టల్ ను సందర్శించి, డెంగ్యూ నివారణపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 30 July 2026 7:19 PM IST
Atmakur
X

Atmakur: బాలికల హాస్టల్‌లో డెంగ్యూ అలర్ట్.. వైద్యాధికారి తనిఖీలు!

ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు యూపీహెచ్‌సీ అరుంధతివాడ పరిధిలోని బీసీ బాలికల కళాశాల హాస్టల్‌ను వైద్యాధికారి డాక్టర్ సాయి ప్రసన్న సందర్శించి విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు.

ఈ సందర్భంగా విద్యార్థినులతో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలు, రోజువారీ అలవాట్లు, ఆహారపు విధానంపై వివరాలు తెలుసుకున్నారు. హాస్టల్‌లో అందిస్తున్న ఆహారం నాణ్యత, భోజన సౌకర్యాలను పరిశీలించిన ఆయన, పోషకాహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని సూచించారు. ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని విద్యార్థినులకు సూచించారు.

డెంగ్యూ నివారణ మాసోత్సవాల్లో భాగంగా హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎస్. సుధాకర్, హెల్త్ అసిస్టెంట్ జి. రవీందర్ రెడ్డి, టీ. శ్రీరాములు విద్యార్థినులకు డెంగ్యూ వ్యాధి వ్యాప్తి, నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడటం, హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని వివరించారు.

డెంగ్యూ లక్షణాలైన జ్వరం, తీవ్రమైన ఒంటినొప్పులు, తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. జ్వరం వచ్చినప్పుడు స్వయంగా మందులు వాడకుండా వైద్యుల సలహా మేరకే చికిత్స తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ సునీత, ఏఎన్‌ఎం నూర్జహాన్, హాస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story