Varikuntapadu: కరెంట్ కష్టాలు 80 రోజులుగా ఎండిపోతున్న పంటలు!
Varikuntapadu: తూర్పు బోయమడుగులలో కాలిపోయిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్. మార్చకపోవడంతో ఎండిపోతున్న జొన్న పైరు; స్పందించాలని అధికారులకు రైతుల విజ్ఞప్తి.
Varikuntapadu: కరెంట్ కష్టాలు 80 రోజులుగా ఎండిపోతున్న పంటలు!
Varikuntapadu: నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తూర్పు బోయమడుగుల గ్రామంలోని పిల్లాపేరు అవతల ప్రాంతంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు నెలల 20 రోజుల క్రితం కాలిపోయిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఇప్పటివరకు మార్చకపోవడంతో పాటు, విద్యుత్ తీగలు కూడా దెబ్బతిన్నప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ట్రాన్స్‌ఫార్మర్ పరిధిలోని ఐదుగురు రైతులు పలుమార్లు సంబంధిత ఏఈకి ఫోన్ చేసి సమస్యను వివరించినా, "వస్తాం... చూస్తాం... సిబ్బందినిపంపిస్తాం" అనే హామీలకే పరిమితమయ్యారని ఆరోపిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి మరమ్మతులు చేపట్టకపోవడంతో పంటలకు నీరందించే అవకాశం లేక తీవ్ర నష్టం వాటిల్లుతోందని తెలిపారు.
పశుగ్రాసం కోసం సాగు చేసిన జొన్న గడ్డి పంటకు గత మూడు నెలలుగా తగినంత నీరు అందక ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే భారీ పెట్టుబడులు పెట్టిన రైతులు పంట చేతికొచ్చే సమయంలో విద్యుత్ సమస్య వల్ల నష్టపోతున్నామని వాపోతున్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులు ఆర్థికంగా కుంగిపోతున్నారని, వెంటనే స్పందించి కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌ను మార్చడంతో పాటు దెబ్బతిన్న విద్యుత్ తీగలను మరమ్మతు చేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని తూర్పు బోయమడుగుల రైతులు ప్రభుత్వాన్ని, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను కోరుతున్నారు."పంటలు ఎండిపోయిన తర్వాత అధికారులు స్పందిస్తే ప్రయోజనం ఏమిటి? రైతుల కష్టాలు కనిపించడం లేదా?" అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.




