Venkatachalam: స్వర్ణభారత్ ట్రస్ట్ 25 ఏళ్ల వేడుకలు మీడియా సమావేశంలో వెంకయ్య!
Venkatachalam: స్వర్ణభారత్ ట్రస్ట్ రజతోత్సవాల వేళ మీడియా ఆత్మీయ సమావేశం సోషల్ మీడియా నియంత్రణపై పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపు
Venkatachalam: స్వర్ణభారత్ ట్రస్ట్ 25 ఏళ్ల వేడుకలు మీడియా సమావేశంలో వెంకయ్య!
Venkatachalam: నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్ ప్రాంగణంలో ట్రస్ట్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన మీడియా మిత్రుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు.
శ్రీ వాజ్‌పేయి గారి ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ‘ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన (PMGSY)’ ద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది గ్రామాలకు పక్కా రోడ్లు అనుసంధానం చేయడం తన ప్రజా జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చిన ఘట్టమని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి మీడియా మిత్రులు ప్రశ్నించగా ప్రజాస్వామ్యంలో విధానాల ఆధారంగా విమర్శలు ఉండాలి తప్ప వ్యక్తులపై, కుటుంబాలపై బురదజల్లే వ్యక్తిగత దూషణలు ఉండరాదని పేర్కొన్నారు. సభల్లో, చట్టసభల్లో గౌరవప్రదమైన చర్చలు సాగాలని నిరసనలకు హద్దులు ఉండాలని, అశ్లీల దూషణలు చేసే ధోరణి మారాలని సూచించారు.
సమాజంలో విద్వేషాలు, వ్యక్తిగత దూషణలు, హింసను ప్రేరేపించే రీతిలో సోషల్ మీడియా దుర్వినియోగం కావడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన శ్రీ వెంకయ్యనాయుడు, సోషల్ మీడియా క్రమంగా "యాంటీ-సోషల్" మీడియాగా మారుతోందన్నారు.
ఆస్ట్రేలియా తదితర అంతర్జాతీయ దేశాల్లో అమలు చేస్తున్న తరహాలోనే, మన దేశంలోనూ 16 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా ఖాతాలు ఉండకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పాఠశాలల్లో పిల్లలకు మొబైల్ ఫోన్లు అనుమతించకూడదని, అవసరమైతే సమాచార మార్పిడి కోసం పాఠశాల ప్రధానోపాధ్యాయుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. భోజనం చేసే సమయంలో, కుటుంబ సభ్యులతో గడిపే సమయంలో పిల్లలకు ఫోన్లు అలవాటు చేయడం వారి మానసిక వికాసానికి గొడ్డలిపెట్టు వంటిదనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
భారతదేశంలో ఇప్పటికీ 55-58% జనాభా గ్రామాల్లోనే నివసిస్తోందన్న శ్రీ వెంకయ్యనాయుడు, గ్రామీణ ప్రాంతాల సాధికారత సాధించకుండా దేశం పూర్తి స్థాయిలో పురోగమించలేదని తెలిపారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర భాయ్ మోదీ సంకల్పించిన ‘వికసిత భారత్ 2047’ లక్ష్యం చేరాలంటే పల్లెలు ఆకలి, అసమానతలు, అన్యాయం లేని రామరాజ్యంలా వికసించాలన్నారు.
ఇదే సంకల్పంతో 2001లో ప్రారంభమైన స్వర్ణభారత్ ట్రస్ట్ నేడు 25 వసంతాల రజతోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్న ఆయన, గ్రామీణ పేదలకు ఉచిత వైద్య శిబిరాలు, నిరుద్యోగ యువతకు సాంకేతిక నైపుణ్యాభివృద్ధి శిక్షణ, మహిళా సాధికారత వంటి కార్యక్రమాల ద్వారా నిరంతరం ప్రజలకు అండగా నిలుస్తోందన్నారు.
రాజకీయాల్లో వారసత్వాన్ని తాను ఎన్నడూ ప్రోత్సహించలేదని, అయితే ప్రజాసేవలో మాత్రం యువత, తన కుటుంబ సభ్యులు సేవా వారసత్వాన్ని అందిపుచ్చుకుని ట్రస్ట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో స్వర్ణభారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి దీపా వెంకట్, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. అంతకుముందు మీడియా మిత్రులతో కలిసి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు.. ఆత్మీయ ఉపాహార విందులో పాల్గొన్నారు.




