Nellore: వైసీపీ ఒక వైరస్... ఆ వైరస్‌ను తొలగించాలి.. వక్ఫ్ బోర్డ్ చైర్మన్!

Nellore: నెల్లూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొన్న ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్. వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు.

A Praveen, Nellore
Published on: 1 Oct 2026 1:04 PM IST
Nellore
X

Nellore: వైసీపీ ఒక వైరస్... ఆ వైరస్‌ను తొలగించాలి.. వక్ఫ్ బోర్డ్ చైర్మన్!

Nellore: వైసీపీ ఒక వైరస్ అని, ఆ వైరస్‌ను తొలగించాల్సిన అవసరం ఉందని ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో కసి, పోటీ ఉండొచ్చు. కానీ ఆ కసి రాష్ట్రంపై, ప్రజలపై ఉండకూడదు అని పేర్కొన్నారు. నగరంలోని కోటమిట్ట లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వాలు శాశ్వతం కాదని, ప్రజలు, రాష్ట్రం శాశ్వతమని అన్నారు.

రాజకీయ ప్రత్యర్థులతో రాజకీయంగానే పోరాడాలని, రాష్ట్ర అభివృద్ధిని, ప్రజల భవిష్యత్తును దెబ్బతీసే విధంగా వ్యవహరించకూడదన్నారు. మూడు రాజధానుల పేరుతో గతంలో రాష్ట్రాన్ని గందరగోళానికి గురిచేశారని, ఇప్పుడు అమరావతి అభివృద్ధి జరుగుతుంటే మళ్లీ ప్రజల్లో అయోమయం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలని, అందుకు రాష్ట్రంపై నమ్మకం ఉండాలని పేర్కొన్నారు.

గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం నుంచి పలు పెట్టుబడులు వెనక్కి వెళ్లాయని ఆరోపించారు. పెట్టుబడిదారుల్లో విశ్వాసం కల్పించి రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు, ఐటీ సంస్థలు తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని అన్నారు. ఒకటో తేదీ వచ్చిందంటే అవ్వాతాతలు, వితంతు అక్కాచెల్లెళ్లు, దివ్యాంగ కుటుంబాల్లో ఒక నమ్మకం కనిపిస్తోందని, సెలవైనా, పండుగైనా పెన్షన్ తమ ఇంటికే వస్తుందనే భరోసా వారిలో ఉందని, వారి కళ్లలో కనిపిస్తున్న ఆనందమే కూటమి ప్రభుత్వ సంక్షేమ పాలనకు నిదర్శనమని అన్నారు.

ఎన్టీఆర్ భరోసా కింద వృద్ధులు, వితంతువులు తదితర అర్హత కలిగిన పలు వర్గాలకు నెలకు 4 వేలు సామాజిక భద్రతా పెన్షన్ అమలవుతోందని పేర్కొన్నారు. పేదవాడు గౌరవంగా బతకాలి. ప్రతి కుటుంబానికి భరోసా ఉండాలి. ప్రతి బిడ్డకు మంచి చదువు, ఉపాధి అవకాశాలు రావాలి. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా సమాంతరంగా సాగాలి. అదే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. నెల్లూరు నగర అభివృద్ధికి పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు.

నగరంలో మౌలిక వసతుల అభివృద్ధికి 240 కోట్లను తీసుకొచ్చారని అన్నారు. నెల్లూరు ప్రజలు ఇచ్చిన అపూర్వమైన ఆదరణకు మంత్రి నారాయణ అభివృద్ధి రూపంలో రుణం తీర్చుకుంటున్నారు. రోడ్లు, కాలువలు, పార్కులు, పాఠశాలలు, ఇతర మౌలిక వసతులను మెరుగుపరుస్తూ నెల్లూరును అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు అని అన్నారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రస్తావిస్తూ కేంద్రం, రాష్ట్రం, స్థానిక సంస్థల మధ్య సమన్వయం ఉంటే ప్రజలకు అభివృద్ధి ఫలాలు మరింత వేగంగా అందుతాయని అబ్దుల్ అజీజ్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని మోసం చేయకూడదు... ప్రజలను మోసం చేయకూడదు. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగాలు, మెరుగైన జీవనం. రాష్ట్ర ప్రయోజనాలకు అడ్డుపడే రాజకీయాలను ప్రజలు గుర్తించాలి అని అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కరిముళ్ళా, మైనుడ్డిన్, ఇంతియాజ్, ఖలీల్, కాలేష, జాఫర్ మొహిద్దిన్, ఉస్మాన్, రబ్బానీ తదితరులు పాల్గొన్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore