Atmakur: ఆత్మకూరును అగ్రగామి మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం: మంత్రి ఆనం!

Atmakur: ఆత్మకూరు మున్సిపాలిటీని రాష్ట్రంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే రూ.29 కోట్ల పనులు చేపట్టినట్లు వెల్లడించారు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 25 Sept 2026 11:05 PM IST
Atmakur
X

Atmakur: ఆత్మకూరును అగ్రగామి మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం: మంత్రి ఆనం!

నెల్లూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీని రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల కంటే అగ్రగామిగా తీర్చిదిద్దే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆత్మకూరు ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.

ఆత్మకూరు మున్సిపాలిటీలోని అన్ని ప్రాంతాలకు సమానంగా అభివృద్ధి ఫలాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. మున్సిపాలిటీలో ఇప్పటివరకు ప్రారంభించిన అభివృద్ధి పనులు, పూర్తయిన పనులు, భవిష్యత్తులో చేపట్టనున్న పనుల వివరాలను త్వరలోనే ప్రజలకు సమగ్రంగా వివరిస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని సమన్వయ సమావేశాలు నిర్వహించి అభివృద్ధి పనుల పురోగతిని ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తామని పేర్కొన్నారు.

ఆత్మకూరు మున్సిపాలిటీ గతంలో 23 వార్డులతో ఉండగా, ప్రస్తుతం 28 వార్డులుగా అవతరించిందని మంత్రి తెలిపారు. మున్సిపాలిటీ పరిధి విస్తరించిన నేపథ్యంలో అన్ని వార్డులు, అన్ని ప్రాంతాల్లో అవసరమైన మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నామని చెప్పారు.

గత పది సంవత్సరాలుగా ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధి “ఎక్కడ వేసిన గొంగళి అక్కడే” అన్న చందంగా ఉందని మంత్రి విమర్శించారు. గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధికి కేవలం రూ.12 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే రూ.29 కోట్ల అభివృద్ధి పనులను చేపట్టామని పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తక్కువ వ్యవధిలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని మంత్రి తెలిపారు. ప్రారంభించిన పనులను మరింత వేగవంతం చేసి, నియోజకవర్గంలోని చివరి ప్రాంతం వరకు అభివృద్ధిని తీసుకెళ్లే లక్ష్యంతో ఎన్డీఏ కూటమి నాయకులందరం కలిసికట్టుగా పనిచేస్తున్నామని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం చేయలేని బృహత్తర కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేసి చూపించిందని, దాదాపు 16,300 మందికి పైగా ఉద్యోగాలు కల్పించామని స్పష్టం చేశారు.డీఎస్సీ విషయంలో వైకాపా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విమర్శించారు.

వాస్తవాలను ప్రజలకు వివరించకుండా పదేపదే అసత్య ప్రచారం చేస్తూ అయోమయానికి గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చేసే విమర్శలకు ప్రతిరోజూ సమాధానాలు చెబుతూ సమయాన్ని వృథా చేయలేమని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల కోసం చేయాల్సిన పనులు, రాష్ట్ర అభివృద్ధి కోసం సాధించాల్సిన లక్ష్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయని, వాటిపైనే ప్రభుత్వం దృష్టి సారిస్తోందని తెలిపారు. రాజకీయాల్లో నిర్మాణాత్మక విమర్శలను స్వాగతిస్తామని, కేవలం కక్షసాధింపుతో బురదజల్లే ప్రయత్నాలను పట్టించుకోబోమని చెప్పారు.

కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌తో పాటు బీజేపీ నాయకత్వం పూర్తి సమన్వయంతో పనిచేస్తోందని మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘స్వర్ణాంధ్రప్రదేశ్–2047’ లక్ష్యాలను సాధించే దిశగా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

ఆత్మకూరు మున్సిపాలిటీని ఈ ఐదేళ్లలో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల కంటే అగ్రస్థానంలో నిలిపే బాధ్యతను తాను తీసుకుంటానని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని కోరారు.స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూటమి నాయకులతో తొలి సమావేశం నిర్వహించినట్లు మంత్రి తెలిపారు.

కూటమి భాగస్వామ్య పక్షాల నాయకులతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపామని చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని సమన్వయ సమావేశాలు నిర్వహించి ప్రజలకు ఎప్పటికప్పుడు వివరాలను వెల్లడిస్తామని మంత్రి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)