Nellore: నెల్లూరు వైఎస్సార్ జయంతి వేడుకలు.. నివాళులర్పించిన నేతలు
Nellore: నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్‌లో వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మహానేతకు ఘన నివాళి.
Nellore: నెల్లూరు వైఎస్సార్ జయంతి వేడుకలు.. నివాళులర్పించిన నేతలు
నెల్లూరు: MLC పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో తరలి వచ్చిన వందలాదిమంది కార్యకర్తల నినాదాలతో మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలకు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత, నెల్లూరు నగర నియోజకవర్గ పరిశీలకులు కొండ్రెడ్డి రంగారెడ్డి తదితర నాయకులు పాల్గొని అత్యంత ఘనంగా నిర్వహించారు.
ఆకాశాన్ని తాకే నినాదాలు, ఉప్పొంగిన అభిమానంతో వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కార్యక్రమానికి హాజరై "జోహార్ వైఎస్సార్" అంటూ మహానేతకు ఘన నివాళులర్పించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ....
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత వైఎస్సార్ అని కొనియాడారు. ఆయన ప్రవేశపెట్టిన జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులకు ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ...
భారతదేశంలోనే ప్రజా సంక్షేమాన్ని పాలనకు కేంద్రబిందువుగా తీసుకుని విప్లవాత్మక సంస్కరణలు అమలు చేసిన నాయకుడు వైఎస్సార్ అని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చిందని, ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా లభించేలా చేశారని తెలిపారు.
అలాగే 108, 104 అత్యవసర వైద్య సేవలు, జలయజ్ఞం ద్వారా సాగు, తాగునీటి ప్రాజెక్టులు, రైతులకు ఉచిత విద్యుత్ వంటి కార్యక్రమాలతో గ్రామీణాభివృద్ధికి వైఎస్సార్ విశేష కృషి చేశారని చెప్పారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాడు–నేడు, గ్రామ/వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, చేయూత, ఆసరా, కాపు నేస్తం వంటి సంక్షేమ కార్యక్రమాలతో పేదలు, రైతులు, మహిళల అభ్యున్నతికి కృషి చేశారని పేర్కొన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వైఎస్సార్ అందించిన ప్రజాకేంద్రిత పాలనను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో వందలాది మంది కార్యకర్తల సమక్షంలో మహానేతకు ఘన నివాళులు అర్పించడం, ఆయన సేవలను స్మరించుకోవడం గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




