Nellore: వీఆర్‌సీ సెంటర్ లో హోరెత్తిన వైసీపీ, విద్యార్థి విభాగాల గర్జన

Nellore: అక్రమాలపై వైసీపీ నేతలు కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగులతో భారీ ర్యాలీ నిర్వహించి సీబీఐ విచారణ కోరారు.

ANJANEYULU, MANAKONDURU
Published on: 28 July 2026 7:59 PM IST
Nellore
X

Nellore: వీఆర్‌సీ సెంటర్ లో హోరెత్తిన వైసీపీ, విద్యార్థి విభాగాల గర్జన

నెల్లూరు: మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలపై మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని,ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు సిటీ ఇన్ ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిల నాయకత్వంలో సాగిన ఈ కార్యక్రమానికి నిరుద్యోగులు, విద్యార్థులు వేలాదిగా తరలిరావడంతో విఆర్సి సెంటర్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.

వీఆర్‌సీ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కదం తొక్కారు. డీఎస్సీ పేపర్ లీక్, అక్రమాలపై నిరసన గళం విప్పారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు, నిరుద్యోగ భృతి, తల్లికి వందనం నిధులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం విద్యార్థులు, యువతను తీవ్రంగా వంచించిందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ నెరవేర్చకుండా యువతను రోడ్లపాలు చేశారని విమర్శించారు. ప్రభుత్వం వద్ద చిత్తశుద్ధి ఉంటే డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలన్నారు.

ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. మెగా డీఎస్సీ పేరుతో లక్షలాది మంది నిరుద్యోగుల కడుపు కొట్టి, అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా పేరిట పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, విద్యా వ్యవస్థ తీవ్రంగా దిగజారిపోయిందని ధ్వజమెత్తారు. నిరుద్యోగ భృతి 3,000, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను ప్రభుత్వం ఎగ్గొట్టిందని విమర్శించారు.

మంత్రి లోకేష్ రాజీనామా చేయకపోతే రాబోయే రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కీలక నాయకులు, కార్యకర్తలు, విపరీతమైన సంఖ్యలో నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు.

ANJANEYULU, MANAKONDURU

ANJANEYULU, MANAKONDURU

Next Story