Nellore: పీఆర్సీ ఎక్కడ? ఐఆర్ ఎక్కడ? ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన మాజీ ఎమ్మెల్సీ

Nellore: హిమాచల్ ప్రదేశ్ తరహాలో ఏపీలో ఉద్యోగుల జీతాలు తగ్గిస్తామన్న లీకులపై వైఎస్సార్సీపీ నేత పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఫైర్.

V. Narasimhulu, Nellore
Published on: 23 April 2026 7:51 PM IST
Nellore
X

Nellore: పీఆర్సీ ఎక్కడ? ఐఆర్ ఎక్కడ? ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన మాజీ ఎమ్మెల్సీ

Chandrasekhar Reddy: కూటమి ప్రభుత్వం ఉద్యోగుల బ్లాక్‌ మెయిలింగ్‌కు దిగిందని, అందుకే హిమాచల్‌ తరహాలో జీతాలు తగ్గిస్తామని లీకులు ఇచ్చిందంటూ ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైయస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ..

గత ఎన్నికల్లో ఉద్యోగులకు అలవి కాని హామీలు అధికారంలోకి వచ్చాక అమలు చేయలేక అవస్థలు తప్పించుకునేందుకు కూటమి ప్రభుత్వం ఎత్తుగడలు వేస్తోందని, అందుకే ఎల్లో మీడియాలో బ్లాక్‌ మెయిలింగ్‌ కథనాలు వస్తున్నాయని చెప్పారు. ఏపీలో ఉద్యోగులపై కూటమి సర్కార్‌ భారీ కుట్ర జరుగుతోందని, ఏపీకీ, హిమాచల్‌ప్రదేశ్‌ ఆర్ధిక పరిస్దితికీ పోలికేంటి? అని హిమాచల్‌ తరహాలో ఉద్యోగుల జీతాలు తగ్గిస్తారా? హామీలు అమలు చేయకపోగా బ్లాక్‌ మెయిలింగా? అంటూ సూటిగా ప్రశ్నించారు.. ఎన్ని కష్టాలున్నా ఉద్యోగులకు తాము ఐఆర్‌ ఇచ్చామని, కోవిడ్‌ లోనూ ఠంచనుగా ఒకటో తేదీ జీతాలిచ్చామని, పీఆర్సీ కమిషనర్‌ ను నియమిస్తే రాజీనామా చేయించారని, మూడేళ్లవుతున్నా కొత్త పీఆర్సీ వేయకుండా మీనమేషాలు లెక్కించడం, ఇప్పుడు ఉద్యోగులు ఐఆర్, పీఆర్సీ అడక్కుండా తప్పుడు రాతలు రాస్తున్నారని ఆక్షేపణ చేశారు.

గత ఎన్నికల్లో ఉద్యోగులకు అలవికాని హామీలిచ్చి, వాటిని అమలు చేయకుండా రెండేళ్లు కాలం గడిపేసిన కూటమి సర్కార్‌.. ఇప్పుడు వారు అవేవీ అడక్కుండా హిమాచల్‌ ప్రదేశ్‌ లా జీతాలు తగ్గిస్తామని ఎల్లో మీడియాలో లీకులు ఇవ్వడం దారుణమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి మండిపడ్డారు. గతంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే తొలి కేబినెట్లోనే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ ప్రకటిస్తే.. ఇప్పుడు కూటమి సర్కార్‌ ఎన్నికల హామీలు నిలబెట్టుకపోగా, మూడేళ్లయినా పీఆర్సీ కమిషన్‌ ను సైతం నియమించకుండా మోసం చేస్తోందన్నారు. ఉద్యోగులు అవన్నీ అడుగుతారనే వాళ్లను బ్లాక్‌ మెయిలింగ్‌ చేసేందుకు హిమాచల్‌ ప్రదేశ్‌ కథల్ని తెరపైకి తెస్తున్నారని పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి ఆక్షేపించారు.

"అలవి కాని హామీలిచ్చి ఇప్పుడు యూటర్న్‌"

2024 ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఉద్యోగుల్ని చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఎంతో రెచ్చగొట్టారని, మా ప్రభుత్వం గనుక వస్తే మీకు ఎంతో మేలు చేస్తామని, మీకు రావాల్సిన ఆర్దిక ప్రయోజనాలన్నీ ఇచ్చేస్తామని మోసపూరిత మాటలు చెప్పారని, కానీ ప్రభుత్వంలోకి వచ్చాక ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా దారుణంగా మోసం చేస్తున్నారని చెప్పారు. నిన్న ఎల్లో మీడియాలో కథనాలు చూస్తే ప్రభుత్వ ఉద్యోగులు ఉలిక్కి పడేలా ఉందని, చంద్రబాబు ఏదైనా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పుడు తన అనుకూల పత్రికల ద్వారా లీక్‌ ఇస్తారని చెప్పారు. ఆ తర్వాత వాటిని అమలు చేస్తారని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కూడా అదే చేస్తున్నారని చెప్పారు. వారికి ఇక నుంచి ఏమీ ఇవ్వబోమన్న సంకేతాలు తన అనుకూల మీడియాలో లీక్‌ల ద్వారా చెప్పారని తెలిపారు.

నిన్న (గురువారం) ఎల్లో మీడియాలో ఆంధ్రప్రదేశ్‌ను హిమాచల్‌ప్రదేశ్‌తో పోలుస్తూ ఓ కథనం వండి వార్చారు. ఇందులో ‘ఖర్చుల నియంత్రణ కోసం జీతాలు తగ్గించిన హిమాచల్‌ ప్రదేశ్‌.. ఆర్దికంగా మనమూ (ఆంధ్రప్రదేశ్‌) కూడా అంతంతే. జీతాలు, పెన్షన్ల వ్యయం ఏపీలో అత్యధికంగా ఉంది.. ఇలాగైతే మనదీ హిమాచల్‌ ప్రదేశ్‌ లాగానే.. రాష్ట్ర సొంత ఆదాయంలో జీతాలు, పెన్షన్లదే అగ్రవాటా.. ఆర్ధిక పరిస్ధితి ఇలాగే కొనసాగితే ప్రభుత్వ ఆదాయం ఉద్యోగుల జీతాలకు కూడా సరిపోదని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.. ఇప్పటికే రూ.70 వేల కోట్లు జీతభత్యాలకు ఖర్చవుతోందని రాశారు. అందుకే రాబోయే రోజుల్లో హిమాచల్‌ప్రదేశ్‌ తరహాలో ఇక్కడ కూడా జీతాలు తగ్గించే అవకాశం ఉందని చెప్పకనే చెప్పారని తెలిపారు.

"జగన్‌ హయాంలో కష్టాలున్నా 27 శాతం ఐఆర్‌ ఇచ్చాం"

గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే మొట్టమొదటి కేబినెట్లోనే ఐఆర్‌ 27 శాతం వెంటనే ఇచ్చి అమలు చేశామని, కోవిడ్‌ సమయంలో రెండేళ్లు కష్టాలున్నా ఒకటో తేదీ ఠంచనుగా జీతాలు ఇచ్చామని, అన్ని కష్టాలు ఉన్నా 3 శాతం పీఆర్సీ ఇచ్చామని, ప్రతీ విభాగంలోనూ ప్రమోషన్లు ఇచ్చామని, అంతకు మించి కూటమి ప్రభుత్వంలో మేలు జరుగుతుందని ఉద్యోగులు ఆశించారని, కానీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయిందని , అయినా ఇప్పటికీ ఉద్యోగులకు ఏ ఒక్క మేలూ జరగలేదని చెప్పారు. బీజేపీ, పవన్‌ కళ్యాణ్, చంద్రబాబు కలిసి ఇచ్చిన మ్యానిఫెస్టోను తప్పకుండా అమలు చేస్తారని అందరూ ఆశించారని, ఓ మ్యానిఫెస్టో ఇచ్చి ప్రజలకు వైఎస్సార్సీపీ నమ్మకం కలిగించిన తర్వాత .. టీడీపీ కూటమి ఇచ్చిన మ్యానిఫెస్టోను అంతా నమ్మారని,ళఇందులో ఉద్యోగుల సీపీఎస్, జీపీఎస్‌ విధానం పునస్సమీక్షించి ఆమోదయోగ్యమైన విధానం తెస్తామన్నారు. అలాగే మెరుగైన పీఆర్సీ అమలు చేస్తామన్నారు. 2023 ఆగస్టు ఒకటో తేదీన గత పీఆర్సీ గడుపు ముగిసిందని, వెంటనే కొత్త పీఆర్సీ వేయాల్సి ఉందని , కానీ మూడేళ్లవుతున్నా పీఆర్సీ కమిషన్‌ కూడా వేయలేదని చెప్పారు.

జగన్మోహన్‌ రెడ్డి వేసిన పీఆర్సీ కమిషన్‌ కు కమిషనర్‌ గా ఉన్న అధికారితో రాజీనామా కూడా చేయించారని, కానీ ఇప్పటికీ కనీసం ఐఆర్‌ కూడా ఇవ్వలేదని, ఇలాంటి పరిస్ధితి ఏ రాష్ట్రంలోనూ లేదని చెప్పారు. ఈ ఐఆర్, పీఆర్సీలు అడుగుతారనే ఉద్యోగులపై ఇలాంటి వార్తలు వేయిస్తున్నారని చెప్పారు.

"ఉద్యోగులు ప్రశ్నించకుండా బ్లాక్‌ మెయిలింగ్‌ కథనాలు"

ఉద్యోగులకు మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా, వాళ్లకు ఇవ్వాల్సిన బకాయిలు రూ.35 వేల కోట్లకు చేరుకున్నా ఇప్పటికీ వాటి ఊసెత్తడం లేదని, ఇవన్నీ అడుగుతారనే రాష్ట్రం దివాళా తీసే పరిస్ధితి ఉందని కథనాలు రాయిస్తున్నారని చెప్పారు. తద్వారా ఉద్యోగులు తమకు ఇచ్చిన హామీలు, బకాయిలు అడక్కుండా వారిని బ్లాక్‌ మెయిల్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఐఆర్, పీఆర్సీల ద్వారా ఉద్యోగులకు న్యాయం చేస్తారని ఉద్యోగులు ఆశపడుతున్న సమయంలో ఇలాంటి కథనాలు రాయిస్తున్నారంటే ప్రభుత్వ దమననీతి అర్థమవుతోందని చెప్పారు.

ఉద్యోగ సంఘాలు వీటి మీద ధర్నాలకు, సమ్మెలకు సిద్దమతున్నారని తెలిసి, సదరు ఉద్యోగ సంఘం నాయకుడిని పర్మనెంట్‌ చేశారని, వీటిపై ప్రశ్నించే ఉద్యోగ నాయకుల్ని సస్పెండ్, డిస్మిస్‌ లు చేసే పరిస్ధితుల్లో ప్రభుత్వ ఉందని చెప్పారు. వైఎస్సార్సీపీ హయాంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే, రాష్ట్రం శ్రీలంక అయిపోతోదంటూ విమర్శలు చేశారని, కోవిడ్‌ ను ఎదుర్కొని కూడా ఐదేళ్లలో మేం చేసిన అప్పు రూ.3.31 లక్షల కోట్లు మాత్రమేనని, అదే ఈ కూటమి ప్రభుత్వం 22 నెలల్లోనే ఏకంగా రూ.3.58 లక్షల కోట్ల అప్పు చేసిందని చెప్పారు. అయినా అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేయడంతో పాటు, ఉద్యోగుల ప్రయోజనాల్ని కూడా కాలరాస్తున్నారని చెప్పారు.=

గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నీ రద్దు చేశారని, కొత్తగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు లేవని, మరి తెస్తున్న అప్పంతా ఏమవుతోంది? ఎవరి జేబుల్లోకి పోతోంది. పనులన్నీ రాజధాని అమరావతి ప్రాంతంలోనే చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే రూ.55 వేల కోట్ల విలువైన టెండర్లు ఖరారు చేసి, వాటిలో 10 శాతం మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ కింద ఇచ్చి అందులో 8 శాతం కమిషన్‌ తీసుకున్నారని చెప్పారు. పనులన్నీ తమకు కావాల్సిన వారికే ఇచ్చారని, అలా అంతా కలిసి డీపీటీ (దోచుకో పంచుకో తినుకో) చేస్తున్నారు.

మరోవైపు ప్రభుత్వం ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తోందని చెప్పారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌ అడుగు బయటపెడితే హెలికాప్టర్లు, స్పెషల్‌ ఫ్లైట్స్‌. విశాఖలో యోగా డే కోసం రూ.300 కోట్లకు పైగా ఖర్చు చేశారని తెలిపారు. సీఎం చంద్రబాబు ప్రతి నెలా 1న పెన్షన్‌ పంపిణీ పేరుతో ఒక్కో చోటికి వెళ్తూ, సెట్టింగ్‌లతో డ్రామాలు చేస్తున్నారని. ఇదే పరిస్ధితి కొనసాగితే ఉద్యోగులకు భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తప్పవని, కాబట్టి ఉద్యోగులు ఏకతాటిపైకి వచ్చి తమ డిమాండ్లు నెరవేర్చుకోవాలని, ఉద్యోగులు, కార్మికులకు వైఎస్సార్సీపీ పూర్తి స్ధాయిలో అండగా ఉంటుందని ఇప్పటికే జగన్‌ హామీ ఇచ్చారని గుర్తు చేశారు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story