Bodhan: బోధన్‌లో వరుస చోరీలు.. నిందితుడు రాహిల్ అరెస్ట్
Bodhan: బోధన్‌లో వరుస చోరీలకు పాల్పడిన రాహిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వాహనాలు, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
Bodhan
Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో వరుస చోరీలకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పట్టణ సీఐ వెంకటనారాయణ వెల్లడించిన వివరాల ప్రకారం, వ్యసనాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న రాహిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పోతంగల్ కాలాన్‌కు చెందిన రాహిల్, ప్రస్తుతం బాన్సువాడలో నివాసం ఉంటున్నాడు. సోమవారం సాయంత్రం బోధన్ పట్టణంలోని ఆచంపల్లి ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు పట్టుకొని విచారించారు.
పోలీసుల విచారణలో నిందితుడు విలాసాలకు అలవాటు పడి డబ్బుల కోసం చోరీలకు పాల్పడుతున్నట్లు అంగీకరించినట్లు సీఐ తెలిపారు. ఈ నెల 18న ఎడపల్లి మండలం అంబం గేట్ వద్ద నిలిపిన బుల్లెట్ వాహనం, 16న గంగారం హాస్పిటల్ ఎదురుగా పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనం దొంగిలించినట్లు వెల్లడించారు.
అలాగే ఈ నెల 14న ఆచంపల్లిలో తాళం వేసిన ఇంట్లోకి ప్రవేశించి ల్యాప్‌టాప్ దొంగిలించినట్లు, బోధన్ మండలం లంగడాపూర్ గ్రామంలో ఒక వ్యక్తి వద్ద నుంచి సెల్‌ఫోన్ లాక్కొని పారిపోయినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడి వద్ద నుంచి దొంగిలించిన వాహనాలు, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.




