Kamareddy: కామారెడ్డిలో సంచలన హత్య కేసు ఛేదన.. పనిమనిషి, భర్త అరెస్ట్!
Kamareddy: కామారెడ్డిలో సంచలనం సృష్టించిన వృద్ధురాలి హత్య, దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు. పనిమనిషి, ఆమె భర్తను అరెస్ట్ చేసి 8 తులాల బంగారం స్వాధీనం.
Kamareddy: కామారెడ్డిలో సంచలన హత్య కేసు ఛేదన.. పనిమనిషి, భర్త అరెస్ట్!
Kamareddy: కామారెడ్డి పట్టణంలో సంచలనం సృష్టించిన వృద్ధురాలి హత్య, దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. పనిమనిషిగా నమ్మకం సంపాదించి.. భర్త సహాయంతో వృద్ధురాలిని హత్య చేసి బంగారు ఆభరణాలు దోచుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భార్యాభర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో సుమారు 8 తులాల బంగారు ఆభరణాలతో పాటు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు.. నిందితురాలికి గతంలోనూ చోరీకి సంబంధించిన నేర చరిత్ర ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
కామారెడ్డి పట్టణంలోని ముప్రీబ్బాగ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సెప్టెంబర్ 29న చిట్మల్ అనసూయ (66) అనే వృద్ధురాలు తన ఇంట్లో హత్యకు గురైంది. ఇంటికి తిరిగి వచ్చిన భర్త.. అనసూయ మంచంపై అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించారు. ఆమె మెడపై గాయాలు ఉండటంతో పాటు, ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో హత్య, దోపిడీ కేసు నమోదు చేసిన కామారెడ్డి పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు, డీఎస్పీ ఎస్. మధుసూదన్ పర్యవేక్షణలో పట్టణ పోలీస్ ఇన్‌స్పెక్టర్ బి. నరహరి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. దర్యాప్తులో భాగంగా మృతురాలి ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న బోసు రజితపై అనుమానం రావడంతో పోలీసులు నిఘా పెట్టారు. అనంతరం రజితతో పాటు ఆమె భర్త బోసు నర్సింగ్‌ను గంజ్ పాఠశాల సమీపంలో అదుపులోకి తీసుకుని విచారించారు.
పోలీసుల కథనం ప్రకారం.. బంగారు ఆభరణాలను దొంగిలించాలనే పథకంతో ఇంట్లోకి ప్రవేశించిన నిందితులు, అనసూయను హత్య చేసి ఆభరణాలను అపహరించినట్లు విచారణలో వెల్లడైంది. విద్యుత్ సరఫరాను నిలిపివేసి, తువ్వాలుతో గొంతు బిగించి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదే కాకుండా.. గతంలో కామారెడ్డిలోని మరో ఇంట్లో పనిమనిషిగా పనిచేసిన సమయంలోనూ రజిత బంగారు ఆభరణాలు దొంగిలించినట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు పేర్కొన్నారు.
నిందితుల నుంచి బంగారు పుస్తెల తాడు, రెండు ఉంగరాలు, చెవి ఆభరణాలు.. మొత్తం సుమారు 8 తులాల బంగారంతో పాటు సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన భార్యాభర్తలను రిమాండ్ నిమిత్తం న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు తెలిపారు.
ఈ కేసును ఛేదించిన పట్టణ పోలీస్ ఇన్‌స్పెక్టర్ బి. నరహరి, ఏఎస్ఐ రంగారావు, కానిస్టేబుళ్లు రామస్వామి, రాజు నాయక్, సంపత్‌లను జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర అభినందించారు.




