Jukkal: జుక్కల్‌లో ఇందిరమ్మ ఇళ్లపై సమీక్ష.. సర్వే త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే

Jukkal: జుక్కల్‌లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు సమీక్షించారు. పెండింగ్ సర్వేలు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.

Sriveni Erugu
Published on: 23 April 2026 10:45 AM IST
Jukkal
X

Jukkal

Jukkal: కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియపై అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు సూచించారు. ఆన్లైన్ సర్వే కారణంగా లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన అధికారులు, గ్రామ సర్పంచ్‌లతో సమీక్ష నిర్వహించారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో జుక్కల్ మండలానికి చెందిన వివిధ శాఖల అధికారులు, గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు పాల్గొన్నారు. పెండింగ్‌లో ఉన్న సర్వేలను తక్షణమే పూర్తి చేసి, అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఇందిరమ్మ ఇళ్లు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు.

అదే విధంగా గ్రామాల్లో ఉన్న డ్రైనేజీ, త్రాగునీరు, రహదారులు, విద్యుత్ వంటి మౌలిక వసతుల సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని సూచించారు. గ్రామ సర్పంచ్‌లు, అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ప్రతి అధికారికి బాధ్యత అని, సమిష్టిగా పనిచేస్తేనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ సమావేశంలో తహసిల్దార్ మారుతి, డిప్యూటీ తహసిల్దార్ హేమలత, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story