Nizamabad: కల్యాణ లక్ష్మి తులం బంగారం ఎత్తివేస్తే ఉద్యమం: బీఆర్‌ఎస్ హెచ్చరిక!
Nizamabad: కల్యాణ లక్ష్మి పథకంలో తులం బంగారం హామీని అమలు చేయాలని, కేసీఆర్ సంక్షేమ పథకాలను నిలిపివేయొద్దని డిమాండ్.
Nizamabad: కల్యాణ లక్ష్మి తులం బంగారం ఎత్తివేస్తే ఉద్యమం: బీఆర్‌ఎస్ హెచ్చరిక!
నిజామాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్‌ఎస్ డిచ్‌పల్లి మండల అధ్యక్షుడు నీరడి పద్మారావు తీవ్రంగా విమర్శించారు. మాజీ రూరల్ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశాల మేరకు డిచ్‌పల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పద్మారావు మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో విజయవంతంగా అమలైన కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, రైతుబంధు, రైతు రుణమాఫీ, కల్యాణ లక్ష్మి తదితర సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. కల్యాణ లక్ష్మి పథకంలో తులం బంగారం అందించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు.కల్యాణ లక్ష్మి పథకాన్ని ఎత్తివేసే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. తులం బంగారం పథకాన్ని ఎత్తివేస్తే బాజిరెడ్డి గోవర్ధన్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకోలు, నిరసనలు చేపట్టి ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.
వడ్ల కొనుగోళ్ల నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం సన్నవడ్ల నిబంధనలను తెరపైకి తెచ్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. మహిళలు, బీడీ కార్మికులు, వృద్ధుల పెన్షన్ల విషయంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను బీఆర్‌ఎస్ ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన నిలిచి ప్రశ్నిస్తుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు శక్కరకొండ కృష్ణ, నల్లవెల్లి సాయిలు, గుడాల లింగం, సర్పంచులు లొక్కిడి యాదగిరి, యూసుఫ్, అమృతపూర్ గంగారాం, మాజీ సర్పంచ్ టి. అంజయ్య, శ్రీనివాస్ గన్‌పూర్, బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఎనోళ్ల రాజు, సంజయ్, సురేష్, S పద్మారావు, ఆసది రవీందర్, గట్టవలి సాయిలు, తదితరులు పాల్గొన్నారు.




