Banswada: నాటు బాంబు బాధితులను పరామర్శించిన పోచారం శ్రీనివాసరెడ్డి
Banswada: బాన్సువాడ తాడ్కోల్ నాటు బాంబు పేలుడులో గాయపడి హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పరామర్శించారు.
Banswada: నాటు బాంబు బాధితులను పరామర్శించిన పోచారం శ్రీనివాసరెడ్డి
బాన్సువాడ: బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామ శివారులోని ఎర్రమన్ను కుచ్చ ప్రాంతంలోని రెండు పడక గదుల లో నివాసం ఉండే ఒడ్డే వారు,నిన్న ఆదివారం పందుల వేట కోసం ఉపయోగించే పేలుడు పదార్థాలు ప్రమాదవశాత్తు పేలిన ఘటనలో ఏడుగురు గాయపడిన విషయం తెలిసిందే. వీరిలో ఒకరిని నిజామాబాద్‌కు,ఇద్దరు చిన్నారులను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రికి,ఒకరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి నిలోఫర్ ఆసుపత్రికి వెళ్లి, చికిత్స పొందుతున్న గాయపడ్డ చిన్నారులు దండ్ల అంజలి (3 సంవత్సరాలు), దండ్ల శ్రీదేవి (5 సంవత్సరాలు)లను పరామర్శించారు.
అనంతరం చిన్నారులకు అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించడంతో పాటు అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించాలని వైద్యులకు సూచించారు.
బాధిత చిన్నారుల కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. చిన్నారులు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ఇంటికి రావాలని ఆకాంక్షించారు.
పోచారం తో నిలోఫర్ ఆసుపత్రి RMO,ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్, తాడ్కోల్ సర్పంచ్ అందే రమేష్,మాజీ జడ్పీటీసీ గోపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.




