Nizamabad: నా ఇల్లు నాకే కావాలి.. పోలీస్ స్టేషన్ ముందు వృద్ధుడి గోడు!
Nizamabad: నిజామాబాద్ జిల్లా ముప్కాల్‌లో దారుణం.. మూడేళ్లుగా న్యాయం కోసం ఓ వృద్ధుడి పోరాటం!
Nizamabad: నా ఇల్లు నాకే కావాలి.. పోలీస్ స్టేషన్ ముందు వృద్ధుడి గోడు!
Nizamabad: తన స్వంత ఇంటి స్థలములో అక్రమంగా గ్రామస్తులు బస్టాండ్ షెడ్డు నిర్మాణం చేపట్టారని న్యాయం కోసం రోడ్డెక్కిన వృద్ధుడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ముప్కాల్ మండల కేంద్రానికి చెందిన భరత్ భూషణ్ అనే వృద్ధుడు తన సొంత ఇంటి స్థలం కోసం రోడ్డెక్కాడు. మూడేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నా తనకు ఫలితం దక్కడం లేదని బాల్కొండలోని ముప్కాల్ పోలీస్ స్టేషన్ వద్ద మీడియా ముందు తన గోడును వెల్లబోసుకున్నాడు.
గతంలో రోడ్డు విస్తరణ పేరుతో భరత్ భూషణ్ ఇంటిని కూల్చేందుకు గ్రామస్తులు ప్రయత్నించారు. దీనిపై ఆయన కోర్టును ఆశ్రయించి స్టే ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అయినప్పటికీ, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ గ్రామస్తులు అక్కడ అక్రమ బస్టాండ్ షెడ్డు నిర్మాణం చేపట్టారని బాధితుడు ఆరోపించాడు. ఇటీవల ఆ స్థలంలో బస్ షెల్టర్ నిర్మాణం కోసం ప్రయత్నాలు జరగడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రస్తుతం ఈ వివాదంపై కోర్టు ధిక్కరణ (Contempt of Court) కేసు నడుస్తోంది. అయితే, ఆ కేసును ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేస్తూ, తనపై అట్రాసిటీ కేసు పెట్టి వేధిస్తున్నారని భరత్ భూషణ్ వాపోయారు. గత నెల 10న బస్టాండ్ షెడ్డు నిర్మాణం ఆపేందుకు ప్రయత్నించగా, ప్రత్యామ్నాయ స్థలం లేదా నష్టపరిహారం ఇస్తేనే సహకరిస్తానని ఆయన స్పష్టం చేశారు. కానీ, అందుకు నిరాకరించిన కొందరు వ్యక్తులు తనను బెదిరించి, స్థలం రిజిస్ట్రేషన్ చేయాలని ఒత్తిడి తెచ్చారని ఆయన పేర్కొన్నారు. ఈ వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు. ఉన్నతాధికారుల జోక్యంతో తాజాగా 20 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైందని భరత్ భూషణ్ వెల్లడించారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి తనకు తగిన నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని ఆయన వేడుకుంటున్నారు.




