Banswada: బాన్సువాడలో మానవతా దృక్పథం చాటుకున్న పోచారం భాస్కర్ రెడ్డి!

Banswada: బాన్సువాడలో అంగవైకల్య బాధితులకు మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి సొంత ఖర్చులతో కృత్రిమ అవయవాలు అందజేశారు.

SALEEM, BANSWADA
Published on: 1 Oct 2026 9:03 AM IST
Banswada
X

Banswada: బాన్సువాడలో మానవతా దృక్పథం చాటుకున్న పోచారం భాస్కర్ రెడ్డి!

Banswada: అంగవైకల్యంతో బాధపడుతున్న బాన్సువాడ పట్టణానికి చెందిన యాదగిరి, కరణ్, మహమ్మద్ కుటుంబాలకు అండగా నిలిచి, వారి జీవితాల్లో తిరిగి ఆశాకిరణాలు నింపేందుకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ డీసీసీబీ చైర్మన్, బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన పోచారం భాస్కర్ రెడ్డి తన సొంత ఖర్చులతో కృత్రిమ చేయి, కాళ్లు వంటి అత్యంత ఖరీదైన సహాయక పరికరాలను అందించారు.

బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన బహిరంగ సభలో లబ్ధిదారులకు ఈ పరికరాలను అందజేశారు. ఈ సభకు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సేవాభావంతో పని చేయడం పోచారం కుటుంబంలో ఉంది - మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి

ఈ సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు చాలా మంది ఉంటారు, ఎమ్మెల్యేలు, ఎంపీలను చాలా మందిని చూశాను. కానీ సేవాభావంతో ప్రజలకు తన సొంత ఖర్చులతో పనులు చేయించడం అభినందనీయం. ఆ గుణం పోచారం కుటుంబంలో ఉంది అని శ్రీనివాసరెడ్డి అన్నారు.

ఎన్నికలప్పుడు ఓట్లు సాధించడానికి అనేక రకాల హామీలు ఇచ్చి మరిచిపోతారు, కానీ భాస్కర్ రెడ్డి వాటిని గుర్తుపెట్టుకుని ముగ్గురికి అత్యంత ఖరీదైన ఆపరేషన్లు చేయించి మళ్లీ కాళ్లు, చేతులు పనిచేసేలా చేయడం గొప్ప విషయం అని అన్నారు..

బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో 11,000 మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేయడం రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఉంది. ఇక్కడి జర్నలిస్టులకు గేటెడ్ కమ్యూనిటీలో ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ నిధులు అందించడం ప్రశంసనీయం.

SRNK కళాశాల ఒక ప్రైవేట్ కళాశాల అయినా ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఇందులో చదివిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు 20 వేల మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. భాస్కర్ రెడ్డి ప్రజల బాగోగుల గురించి ఆలోచించడం, రాజకీయాలకు అతీతంగా పని చేయడం మంచి భవిష్యత్తుకు నాంది పలుకుతుంది అని అన్నారు.

ఇది రాజకీయ సభ కాదు, సేవా కార్యక్రమం - మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

అనంతరం బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈ సభ రాజకీయ సభ కాదు, రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న సభ. తాము ప్రజాసేవే లక్ష్యంగా పని చేస్తాం. కరోనా సమయంలో సుమారు మూడు కోట్ల రూపాయల సొంత నిధులతో చాలా మందిని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేర్పించాం.

నియోజకవర్గంలో వికలాంగులైన వారిని గుర్తించి ఎన్ని కోట్ల నిధులైనా వెచ్చించి వారికి లండన్ నుంచి పరికరాలు తెప్పించి ఆపరేషన్లు చేస్తాం. వికలాంగులను గుర్తించి తమ వద్దకు పంపాలని నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. తాము చేసేది ఓట్ల కోసమో, రాజకీయాల కోసమో కాదు, మానవతా దృక్పథంతో కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడమే తమ ధర్మం.

రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో కరువు వస్తే బాన్సువాడ మాత్రం సుభిక్షంగా ఉంది. తమ దూరదృష్టితో చేసిన పనుల వల్ల నేడు నియోజకవర్గంలో పుష్కలంగా నీరు వచ్చింది, రైతులందరూ పంటలు సాగు చేస్తున్నారు. ఎంతో పత్రికా రంగ అనుభవం ఉన్న కె. శ్రీనివాస్ రెడ్డితో తనకు ఎంతో అనుబంధం ఉంది. 2001లో ఆయనతో కలిసి హెలికాప్టర్ లో బాన్సువాడకు వచ్చాను. అంత అనుభవం ఉన్న జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి జర్నలిస్టులకు ఆదర్శం అని అన్నారు.

వికలాంగులకు జీవితం ఇవ్వడమే లక్ష్యం - పోచారం భాస్కర్ రెడ్డి

డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ వికలాంగులందరికీ సేవ చేయడం లక్ష్యంగా వారికి ప్రత్యేక పరికరాలు అమర్చి మళ్లీ జీవితం గడిపేలా చేయడమే నా లక్ష్యం. ప్రస్తుతం ముగ్గురు నడవగలుగుతున్నారంటే వారికి అవకాశం కల్పించిన నాకు ఎంతో సంతోషంగా ఉంది. విదేశాల నుంచి పరికరాలు తెప్పించి నియోజకవర్గంలోని వికలాంగులకు ఆపరేషన్లు చేయిస్తాను. వారికి బట్టలు కూడా ఇప్పించాం. తన తండ్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి బాటలో ప్రజాసేవ చేయడమే లక్ష్యంగా పని చేస్తాను అని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎర్రవుల కృష్ణారెడ్డి, ఎండీ ఏజాజ్, అలీబిన్ అబ్దుల్లా, గురువు వినయ్ కుమార్, గోపాల్ రెడ్డి, రాజిరెడ్డి, గోపాల్, మాజీద్, TUWJ జిల్లా అధ్యక్షులు రజనీకాంత్ తదితరులు, బాన్సువాడ నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు, మీడియా సోదరులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA