Nizamabad: మహిళల చేతిలో బస్సుల తాళాలు.. నిజామాబాద్‌లో సరికొత్త అధ్యాయం!
Nizamabad: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సుల పంపిణీ. మహిళల ఆర్థిక సాధికారతకు బాటలు వేస్తున్న ప్రభుత్వం.
Nizamabad: మహిళల చేతిలో బస్సుల తాళాలు.. నిజామాబాద్‌లో సరికొత్త అధ్యాయం!
నిజామాబాద్ జిల్లా: కోటిమంది మహిళలను కోటీశ్వరులు చేసే దిశగా తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం బృహత్తరమైన లక్ష్యంతో వడివడిగా అడుగులు వేస్తోంది.ఇందులో భాగంగానే మహిళా సంఘాలకు అనేక వెసులుబాటులు కల్పిస్తూ.. వడ్డీలేని రుణాలతో ఆర్టీసీ బస్సులు పంపిణీ చేస్తోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని 7 మండలాల మహిళా సమాఖ్యలకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన ఆర్టీసీ బస్సులను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకోనున్నారు.
ఈ నేపథ్యంలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళలు 7 బస్సుల్లో హైదరాబాద్ కు బయలుదేరగా.. ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణలో మహిళా సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తోంది అన్నారు. మహిళా సంఘాలకు బస్సులను అందజేయడం ద్వారా.. ఇదివరకు బస్సులో ప్రయాణించే ప్రయాణికులుగానే ఉన్న మహిళామణులు ఇప్పుడు యజమానులుగా చేస్తున్నామన్నారు.
మహిళలు ఆర్ధిక స్వావలంబన సాధించేందుకు, వ్యాపారాలు విస్తరించేందుకు ఒక్కో బస్సు పై మొత్తం రూ .36 లక్షలు వెచ్చిస్తుందన్నారు. అందులో రూ.6 లక్షలు మహిళా సంఘాల కాంట్రిబ్యూషన్ రూ. 30లక్షల బ్యాంకు లింకేజీ ద్వారా వడ్డీలేని రుణాలతో అందజేయడం జరుగుతుందన్నారు. నియోజవర్గ పరిధిలో మొత్తం 7 బస్సులకు గాను 2 కోట్ల 52 లక్షలు కాగా జిల్లా మొత్తంగా 28 బస్సులకు గాను రూ. 10.08 కోట్లు మహిళలకు అందజేయనున్న బస్సుల పై వెచ్చించడం జరిగిందన్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం అందజేసిన ఆర్టీసీ బస్సులను మహిళా సంఘాలు ఆర్టీసీకి అద్దెకు ఇవ్వడం ద్వారా.. ఒక్కో బస్సు పై నెలకు రూ .75 వేలు.. సంవత్సరానికి రూ. 9 లక్షలు సంపాదించుకునే వెసులుబాటు ఉందన్నారు.
అలా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 7 బస్సులకు గాను సంవత్సరానికి రూ.63 లక్షలు సంపాదించుకునే వీలుండగా.. జిల్లా వ్యాప్తంగా 28 బస్సులకు గాను రూ. 2 కోట్ల 52 లక్షలు మహిళా సంఘాలకు సంవత్సరానికి ఆదాయం అందనున్నట్లు పేర్కొన్నారు. ఇలా మహిళలను కోటీశ్వరులను చేసే ప్రభుత్వ లక్ష్యం ప్రయోగాత్మకంగా సాకారం కాబోతుందని వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని ఏమైనా చేసి చూపిస్తుందనరు. అటు మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు, పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పించడం జరుగుతుందన్నారు.
రెండున్నర ఏళ్లలోపే సుమారు 70 వేల కోట్ల బ్యాంకు లింకేజీ ద్వారా టార్గెట్ కు మించి వడ్డీలేని రుణాలు అందించడం జరిగిందన్నారు. అదేవిధంగా మహిళలు తయారు చేసే వస్తువులకు మార్కెటింగ్ కల్పించడం కోసం హైదరాబాద్ శిల్పారామంలో ప్రత్యేకంగా స్టాళ్లు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఇలా మహిళా సంక్షేమార్థం రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుందని పేర్కొన్నారు.
మహిళలు తలపెట్టే ప్రతి వ్యాపారాల్లో ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నవీన్ గౌడ్, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ సాయరెడ్డి, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు మోపాల్ సాయిరెడ్డికి, బాల్ రాజు, సర్పంచ్ ఫోరం మండలాల అధ్యక్షులు వాసు, జలందర్ రెడ్డి, శ్రీనివాస్, శ్యాంసన్, ఆయా గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




