Kamareddy: కామారెడ్డిలో త్వరలో జర్నలిస్టులకు AI శిక్షణ: విరాహత్ అలీ!

Kamareddy: జర్నలిస్టుల సంక్షేమమే తమ ప్రథమ లక్ష్యమని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ స్పష్టం చేశారు.

SALEEM, BANSWADA
Published on: 4 Oct 2026 9:45 PM IST
Kamareddy
X

Kamareddy: కామారెడ్డిలో త్వరలో జర్నలిస్టులకు AI శిక్షణ: విరాహత్ అలీ!

కామారెడ్డి: రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమానికి తమ సంఘం నిరంతరం కృషి చేస్తోందని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ అన్నారు. జర్నలిస్టులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఆదివారం టీయూడబ్ల్యూజే (ఐజేయూ) కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్ ఆధ్వర్యంలో బడా పహాడ్ హజ్రత్ షాదుల్ల హుస్సేని దర్గా( పెద్దగుట్ట)

లో తమ మొక్కూను తీర్చుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విరాహత్ అలీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం జిల్లా లోని మండలాల నుంచి వచ్చిన జర్నలిస్టులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో బాన్సువాడలో నిర్వహించిన జర్నలిస్టుల శిక్షణ తరగతులు విజయవంతమయ్యాయని విరాహత్ అలీ పేర్కొన్నారు. జిల్లా టీయూడబ్ల్యూజే శాఖ, బాన్సువాడ ప్రెస్ క్లబ్ సమన్వయంతో తక్కువ సమయంలోనే శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమన్నారు.

మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి సైతం బాన్సువాడలో జరిగిన శిక్షణ కార్యక్రమంపై సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని చైర్మన్ ప్రశంసించినట్లు తెలిపారు. కొన్ని అనివార్య కారణాల వల్ల శిక్షణ ముగింపు కార్యక్రమానికి తాను హాజరు కాలేకపోయానని విరాహత్ అలీ తెలిపారు.

ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్టులకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరమని పేర్కొంటూ, త్వరలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా మహిళా జర్నలిస్టులకు హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు, సంక్షేమం కోసం తమ యూనియన్ నిరంతరం పనిచేస్తోందని, ప్రచారం కంటే, పని చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్ జర్నలిస్టులను సమన్వయం చేస్తూ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని అభినందించారు.

బడా పహాడ్ దర్గా నిర్వాహకులు టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ దంపతులను, జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్ దంపతులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లతీఫ్, జిల్లా కార్యదర్శి రాజేష్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు సలీం,కార్యదర్శి బైరి సుధాకర్ గౌడ్, ఉపాధ్యక్షుడు యూనుస్, అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు మెయిన్,చదర శేఖర్,అబిద్, బాన్సువాడ జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA